వైద్యులే కనిపించే దేవుళ్ళు
** తుడ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుపతి : సమాజంలో వైద్యులు మాత్రమే కనిపించే దేవుళ్ళతో సమానమని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడ) చైర్మన్ “డాలర్స్” దివాకర్ రెడ్డి అన్నారు. ఆధార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రఫీ ఆధ్వర్యంలో తిరుపతి రుయా హాస్పిటల్ నందు “డాక్టర్స్ డే” వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రవిప్రభు, ట్రాఫిక్ సిఐ సంజీవ్ కుమార్ లతో కలసి తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు దైవంగా భావించేది ఒక్క డాక్టర్ నేనని గుర్తు చేశారు. దైవం వైద్యుల రూపంలో వచ్చి ప్రజలకు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబాన్ని వదిలి పగలు, రాత్రి తేడా లేకుండా వృత్తినే దైవంగా భావిస్తూ ప్రజల ప్రాణాలను రక్షిస్తున్నది ఒక్క డాక్టర్ మాత్రమే అని కొనియాడారు.
రుయా హాస్పిటల్లో 30 ఏళ్ల క్రితం నిర్మించిన సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంను ఆధునికరించాలని సూపరింటెండెంట్ డాక్టర్ రాధా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని కోరగా వెంటనే ఆయన స్పందిస్తూ త్వరలోనే సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంను ఆధునికరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవి ప్రభు, రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, ట్రాఫిక్ సిఐ సంజీవ్ కుమార్ లతో కలసి రుయా హాస్పిటల్ లోని వివిధ విభాగాల డాక్టర్లను తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఘనంగా సత్కరించారు. వైద్యులు కూడా డాలర్స్ దివాకర్ రెడ్డిని సత్కరించారు.
