పబ్లిసిటీ కోసం టీటీడీతో “చీప్ ట్రిక్స్” వద్దు

TEJA NEWS

పబ్లిసిటీ కోసం టీటీడీతో “చీప్ ట్రిక్స్” వద్దు

** బీజేపీనేత నవీన్ కుమార్ రెడ్డి

తిరుపతి: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పవిత్ర పుణ్యక్షేత్ర సంస్థ అయిన టీటీడీతో ఎవ్వరైనా గానీ పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్స్ చేయొద్దండని బీజేపీ సీనియర్ నేత, స్థానిక శ్రీవారి భక్తుడు, సామాజిక సేవాకర్త పి.నవీన్ కుమార్ రెడ్డి హితవు పలికారు. గురువారం ఆయన తిరుపతి వీవీ మహల్ రోడ్డులోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ హిందువులకు ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యక్తులు ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈఓలకు బిజెపి తరపున విజ్ఞప్తి చేశారు. గత కొన్ని నెలలుగా కొంతమంది రాజకీయ నాయకుల ముసుగులో టీటీడీని సొంత పబ్లిసిటీ కోసం ప్రతి చిన్న విషయాన్ని కూడా “గోరంతను కొండంత” చేసి భూతద్దంలో చూపిస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలతో పాటు ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేయడం మహా అపచారమన్నారు. తిరుమల – తిరుపతి దేవస్థానంలో తెలిసో, తెలియకో జరిగే చిన్న చిన్న పొరపాట్లను సైతం టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేయకుండా ఎక్కడో ఏదో అపచారం జరిగిపోయిందని మీడియా ద్వారా నడిరోడ్డు పైకి తీసుకురావడం బాధాకరమన్నారు. తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి ఎంతటి వారైనా ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే చట్టపరంగా కఠినంగా శిక్షించాలని శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని, అయితే అలా కాకుండా సొంత పబ్లిసిటీ కోసం “చీప్ ట్రిక్స్” చేసే వ్యక్తులను సైతం టీటీడీ ఈఓ, అడిషనల్ ఈవోలు ఘాటుగా హెచ్చరించాలన్నారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించే వాస్తవాలు ఎవరికైనా తెలిసినా, భక్తుల దృష్టికి వచ్చినా వెంటనే టీటీడీ ఈవో, అడిషనల్ ఈవోల మెయిల్స్ కి పంపి హిందువుల మనోభావాలను గౌరవించి పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. గత ప్రభుత్వ పాలనలో కూడా టీటీడీలో జరిగిన అనేక తప్పుల మీద అప్పటి టిటిడి అధికారుల, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అధికార బలంతో స్పందించకపోవడంతో హైకోర్టుని సైతం ఆశ్రయించి దైవానుగ్రహంతో అన్ని కేసులలో విజయం సాధించామని నవీన్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.


టీటీడీ విషయంలో ఉద్దేశపూర్వకంగా ఏ ప్రభుత్వమైనా…ఏ రాజకీయ పార్టీవారైనా స్వలాభం కోసం దుర్వినియోగం చేస్తే శ్రీవారి భక్తులుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి సంబంధిత రాజకీయ పార్టీలపై, నాయకులపై, అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకొని కోర్టులో ముద్దాయిగా నిలబెట్టే హక్కు ప్రతి శ్రీవారి భక్తునిపై ఉందన్నారు. టీటీడీ ధార్మిక సంస్థలో తప్పుచేసి అధికార బలంతో తప్పించుకోవచ్చు నేమో గాని “శ్రీ వేంకటేశ్వర స్వామి కోర్టులో” మాత్రం ఎవ్వరూ ఎప్పటికీ తప్పించుకోలేరని, శిక్ష తప్పదన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని నవీన్ హెచ్చరించారు.

You cannot copy content of this page

Scroll to Top