తిరుపతిలో గూండాల దందాను అరికట్టాలి

TEJA NEWS

తిరుపతిలో గూండాల దందాను అరికట్టాలి

** సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్

తిరుపతి: నిత్యం లక్షలాదిగా వచ్చే యాత్రికా స్థలం, సుమారు 6 లక్షల జనాభా కలిగిన తిరుపతి నగరంలో గూండాల దందాను అరికట్టాలని, ఎస్వీ యూనివర్సిటీలో చెట్ల కింద చదువుతున్న వారికి మెరుగైన వసతులు కల్పించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతి వీధి విక్రయదారుల సభలో సోమవారం ఆయన మాట్లాడారు. నిరుద్యోగ విద్యార్థులకు భోజనాలు పెడుతున్న దాతలకు అభినందనలు తెలిపారు.
టీటీడీ చొరవ చూపించి నిరుద్యోగ విద్యార్థులకు భోజనాలు, వసతి సౌకర్యం కల్పించాలన్నారు. వీధి విక్రయదారుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరారు.
ఎస్వీయూలో చెట్ల కిందనే ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు పునరావసం కల్పించి మెరుగైన వసతి, సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఎస్వీయూలో పీహెచ్ డీ, పీజీలు పూర్తి చేసి వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు చెట్ల కిందనే ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని, ఆ విషయాన్ని సీపీఐ గుర్తించిందన్నారు. విద్యార్థులతో నేరుగా కలిసి వారి పరిస్థితిని ఆరాతీయగా కనీస సౌకర్యాలు లేక, ఆర్థిక పరిస్థితి బాగోలేక చెట్ల కింద, ప్లాట్ ఫాంపైనే రాత్రింబవళ్లు ఉంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎస్వీయూలోని పుస్తకాలు తెచ్చుకొని అక్కడే చదువుకొని పరీక్షలకు
హాజరవుతుండడం, అక్కడ ఆ విద్యార్థులు పడుతున్న అగచాట్లు వర్ణణాతీతం అని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై సిపిఐ నాయకులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు కొంతమంది అన్నదాతలను, స్వచ్ఛంద సంస్థలను సంప్రదించగా వారు సానుకూలంగా…. సిద్ధాంతాలకు వ్యతిరేకమున్న వారు కూడా సానుకూలంగా స్పందించి భోజనాలు ఏర్పాటు చేశారని రెండు సంవత్సరాలుగా భోజనాలు పెడుతున్న దాతలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

తిరుపతి ఆర్టీసీ బస్టాండు , రైల్వేటేషన్ వద్ద కొంతమంది గూండాగిరి చేస్తూ వీధి వ్యాపారస్తులు, ఆటోల వద్ద రోజువారి మామూళ్లు రీతిన కొన్ని ప్రాంతాలలో 300 నుండి 1000 రూపాయల వరకు వసూళ్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయం పోలీసుల దృష్టిలో
ఉన్నప్పటికీ చర్యలు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. బస్టాండు వద్ద గూండాగిరి చేస్తున్న వారిపై సీపీఐ ఆధ్వర్యంలో తగిన రీతిలో బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. వీధి విక్రయదారులు పడుతున్న ఇబ్బందుల పట్ల అధికారులు సానుకూలంగా
వ్యవహరించాలని కోరారు. తిరుపతి అభివృద్ధిలో భాగంగా చేపల మార్కెట్ నిర్వహణకు మున్సిపల్ అధికారులు కొత్త షెడ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. వివిధ రూపాన కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న టీటీడీ ప్రదేశాల్లో తత్కాలికంగా
మార్కెట్ నిర్వహణకు సహకరించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని పేదల జీవనాధారానికి ఉపయోగపడేలా చొరవ
తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కే.రాధాకృష్ణ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, నగర కార్యవర్గ సభ్యులు ఎన్డీ రవి, కేవై రాజా, వీధి వ్యాపారస్తుల నగర కార్యదర్శి శ్రీనివాస్, ప్రతాప్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top