కోదండ రామాలయంలో దీపావళి ఆస్థానం

TEJA NEWS

కోదండ రామాలయంలో దీపావళి ఆస్థానం

** 17న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి: తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో ఈనెల 20న దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వ‌హించ‌నున్నారు. దీపావళి సందర్భంగా 20వ తేదీ రాత్రి 7 గంటలకు తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం నుంచి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండ రామస్వామి వారికి సమర్పించ‌నున్నారు. ఈ సందర్భంగా అమావాస్య రోజున ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకం సేవ, హనుమంత వాహన సేవను టీటీడీ రద్దు చేసింది.

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

17వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో 20వ తేదీ దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా 17న తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 10.30 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు.

You cannot copy content of this page

Scroll to Top