తుపానుతో తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులకు న్యాయం చేయండి : ప్రత్తిపాటి

TEJA NEWS

తుపానుతో తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులకు న్యాయం చేయండి : ప్రత్తిపాటి

  • ప్రభుత్వాలు నిర్దేశించిన మద్ధతు ధర సక్రమంగా రైతులకు అందించండి : ప్రత్తిపాటి.
  • రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకూ నష్టం జరగకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని సీసీఐ యంత్రాంగం పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలి…
  • నల్లబర్లీ పొగాకు పూర్తిగా కొంటాం.. దేశంలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పొగాకు కొనుగోళ్లు చేపట్టి, ఇప్పటివరకు రైతులకు రూ.270 కోట్లు చెల్లించారు : మంత్రి గొట్టిపాటి
  • కలెక్టర్ కృతికా శుక్లా, మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో కలిసి నాదెండ్ల మండలం గణపవరంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మాజీమంత్రి ప్రత్తిపాటి

ప్రతి పత్తి రైతుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) న్యాయం చేయాలని, పల్నాడు జిల్లాలో ఈ ఏడాది రైతాంగం 2.53 లక్షల ఎకరాల్లో, నియోజకవర్గవ్యాప్తంగా 28వేల ఎకరాల్లో పత్తి సాగుచేశారని, ఆఖరి క్వింటావరకు వారి నుంచి కొనుగోలు చేయాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బుధవారం నాదెండ్ల మండలం గణపవరంలోని మద్ది లక్ష్మయ్య కాటన్ కంపెనీ పక్కనున్న ధనలక్ష్మి కాటన్ ఎంటర్ ప్రైజెస్ లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి ప్రారంభించి, రైతుల్ని ఉద్దేశించి మాట్లాడారు.

ఒక్క రైతూ నష్టపోకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని కొనుగోళ్లు జరపండి..
అధికవర్షాలతో ఈ సంవత్సరం పత్తి దిగుబడి బాగా తగ్గిందని, వచ్చిన కొద్దిపాటి ఉత్పత్తిని రైతుల నుంచి సకాలంలో సేకరించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు వారికి న్యాయంచేయాలని ప్రత్తిపాటి కోరారు. నిబంధనలు సడలించి అయినా రైతుకు మేలుచేసే దిశగా ఆలోచించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల కష్టానికి విలువిచ్చే నాయకుడని, ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో ఒక్కరైతుకు కూడా నష్టం జరగకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రత్తిపాటి చెప్పారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ రైతుల సమస్యలు తెలిసిన నాయకుడని, ఆయన సూచనలు.. ఆదేశాల్ని యంత్రాంగం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మొంథా తుపాను వల్ల సంభవించిన పంటనష్టాన్ని ప్రభుత్వం ఇప్పటికే అంచనావేసి, కేంద్ర బృందానికి వాస్తవాలు తెలియచేసిందని ప్రత్తిపాటి తెలిపారు. ముఖ్యమంత్రి కూడా స్వయంగా రైతుల్ని ఆదుకోవాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారన్నారు.

అవకాశముంటే చిలకలూరిపేటకు మాత్రమే ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేయండి..
సీసీఐ పర్చేజ్, మానిటరింగ్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కేంద్రాన్ని పర్యవేక్షిస్తూ, కష్టకాలంలో ఉన్న పత్తిరైతుల్ని ఆదుకోవాలని, క్వింటాలుకు రూ.8,110 కి తగ్గకుండా ధర చెల్లించాలని ప్రత్తిపాటి సూచించారు. చిలకలూరిపేట, నరసరావుపేటకు మాత్రమే ఒక సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి గొట్టిపాటి, కలెక్టర్ కృతికా శుక్లాకు విజ్ఞప్తిచేశామని, వీలైతే చిలకలూరిపేట నియోజకవర్గానికి మాత్రమే ప్రత్యేకంగా ఒక కేంద్రం ఉండేలా చూడాలని కూడా కోరినట్టు ప్రత్తిపాటి చెప్పారు. బయట మార్కెట్లతో పోలిస్తే ప్రభుత్వం కొంటున్న శనగ ధరల్లో వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకొని రైతులకు న్యాయం చేయాలని మంత్రి గొట్టిపాటిని కోరుతున్నామన్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా చంద్రబాబు రూ.270కోట్లతో పొగాకు కొనుగోళ్లు చేపట్టారు : మంత్రి గొట్టిపాటి
గతేడాదితో పోలిస్తే పత్తి మద్ధతు ధర 6-7 శాతం పెంచడం జరిగిందని, ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు ఎంతచేసినా తక్కువేనని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభిప్రాయపడ్డారు. బయట మార్కెట్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని క్వింటాకు రూ. 4,500 – 5వేలవరకు ధర చెల్లిస్తున్నారని తెలిసినవెంటనే చిలకలూరిపేటలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రత్తిపాటి పుల్లారావు కోరినట్టు మంత్రి తెలిపారు. రైతాంగం తడిచిన పత్తిని పూర్తిగా ఆరబెట్టాకే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, అప్పుడే వారు ధర విషయంలో గట్టిగా డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుందని గొట్టిపాటి సూచించారు. సీసీఐ సిబ్బంది నిబంధనల పేరుతో రైతులకు పిచ్చిపట్టించకుండా సరళతరంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. ఇప్పటికే పొగాకు కొనుగోళ్లు జరిపామని, ఇంకా ఎక్కడైనా మిగిలి ఉన్నా పూర్తిగా కొనేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమస్యను ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడికి తెలియచేసినట్టు గొట్టిపాటి తెలిపారు. దేశచరిత్రలో ఏ ప్రభుత్వం కూడా పొగాకు కొనుగోళ్లు జరపలేదని, కేవలం చంద్రబాబు గారి చొరవవల్లే ప్రభుత్వం రూ.270 కోట్లు ఖర్చుపెట్టి పొగాకు కొనుగోళ్లు చేపట్టిందన్నారు. అలానే కోకో, మామిడి, శనగ, ఇతర అపరాల కొనుగోళ్లపై కూడా కూటమిప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. మొక్కజొన్న బయట మార్కెట్లో రూ.1500ల వరకు కొంటున్నారని, ప్రభుత్వం నిర్ణయించిన మద్ధతు ధర రూ.2,400 వరకు ఉందని గొట్టిపాటి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధులత, జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, నెల్లూరి రంజిత్, మార్కెట్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, పెంట్యేల శేషయ్య, గంగా శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, డిఏవో జగ్గారావు, సిసిఐ డైరెక్టర్, అధికారులు రమేష్, టీడీపీ ముఖ్య నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top