కార్యకర్తల్ని కన్న బిడ్డలకంటే మిన్నగా అభిమానించి, ఆదరించేది ‘తెలుగుదేశం’ ఒక్కటే: ప్రత్తిపాటి
- యువనేత లోకేశ్ నాయకత్వం పార్టీ సైనికుల్లో చెరిగిపోని నమ్మకం, భద్రత, ప్రోత్సాహాన్ని నింపాయి.
- చంద్రబాబు నాయకత్వబలం పార్టీని దేశ రాజకీయాల్లో ఉన్నతస్థానంలో నిలిపింది.
- రోడ్డు ప్రమాదాల్లో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబసభ్యులకు చంద్రన్నబీమా ఆర్థికసాయం చెక్కులు అందించిన మాజీమంత్రి ప్రత్తిపాటి.
కార్యకర్తల పార్టీగా పేరున్న తెలుగుదేశం పార్టీ ఎన్నో రాజకీయ విపత్తుల్ని తట్టుకొని నిలిచిందని, స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన ముహూర్తబలం.. చంద్రబాబు నాయకత్వబలం దేశ రాజకీయరంగంలో టీడీపీని ఉన్నతస్థానంలో నిలిపాయని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం ఆయన ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాల ఇళ్లకు వెళ్లి, పార్టీ నుంచి మంజూరైన రూ.5లక్షల చంద్రన్నబీమా నగదు చెక్కుల్ని మృతులు భార్యాపిల్లలకు అందించారు. తొలుత పట్టణంలోని సుబ్బయ్య తోట వాస్తవ్యులు, ఇటీవల మరణించిన మద్ది శివశంకర్ గుప్తా ఇంటికివెళ్లిన ప్రత్తిపాటి, కుటుంబసభ్యుల్ని పరామర్శించి, శివశంకర్ సతీమణి శ్రీమతి కన్యాకుమారికి రూ.5లక్షల బీమా సొమ్ము చెక్కును అందించారు. అనంతరం స్థానిక క్యాంపు కార్యాలయంలో యడ్లపాడు మండలం కారుచోల గ్రామానికి చెందిన నల్లజాల రామకోటేశ్వరరావు సతీమణి శ్రీమతి శ్రీలక్ష్మికి చంద్రన్న బీమా సొమ్ము చెక్కును అందించిన ప్రత్తిపాటి. కుటుంబానికి అండగా ఉంటామని ఆమెకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలు, కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడారు.
టీడీపీ సభ్యత్వం .. కష్టసుఖాల్లో తోడుగా నిలిచే ఆపన్నహస్తం.
టీడీపీ సభ్యత్వం అంటే కేవలం గుర్తింపు కాదని, పార్టీని నమ్ముకున్న కుటుంబాలకు కష్టసుఖాల్లో తోడుగా నిలిచే ఆపన్నహస్తమని ప్రత్తిపాటి చెప్పారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను అదుకోవడం, అండగా నిలవడంలో టీడీపీ నాయకత్వాన్ని మించిన నాయకత్వం మరోటి లేదన్నారు. కార్యకర్తల్ని కన్నబిడ్డల కంటే మిన్నగా ఆదరించి, అభిమానించే అధినాయకత్వం టీడీపీకి ఉండటం అందరం గర్వించాల్సిన అంశమన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ అటుపార్టీలో, ఇటు ప్రభుత్వంలో వినూత్న కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఆయన నాయకత్వం పార్టీ కేడర్ లో ఒక భద్రత, భరోసాతో పాటు… చెరిగిపోని నమ్మకాన్ని, ప్రోత్సాహాన్ని అందించిందన్నారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, తుపాకుల అప్పారావు, షేక్ జమాల్ భాషా, టీడీపీ ముఖ్య నాయకులు తదితరులున్నారు.
