తుమ్మలగుంట స్టేడియం ప్రభుత్వ ఆధీనంలోకి
** చెరువులు, రోడ్లు తక్షణం మరమ్మతు చేయండి
** జిల్లాస్థాయి సమీక్షలో ఇన్ చార్జి మంత్రి అనగాని
తిరుపతి: తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని “తుడ” క్రికెట్ స్టేడియంను, జిమ్ ను ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని రాష్ట్ర రెవిన్యూ శాఖ, తిరుపతి జిల్లా ఇన్ చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు. తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అధ్యక్షతన మంగళవారం జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో మంత్రితో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, “తుడ” చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, అర్బన్ ఎమ్మార్వో సురేష్ బాబు, రూరల్ ఎమ్మార్వో సహా పలువురు ఎమ్మార్వోలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ
తిరుపతి గ్రామీణ మండలంలోని
రోడ్లు – భవనాల శాఖకు సంబంధించి దామల చెరువు మంగళంపేట రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో 593 చెరువులు ఉండగా అందులో 33 చెరువులు ప్రమాద స్థాయిలో ఉన్నాయని, వాటిని ఎఫ్డిఆర్ స్కీం లో పెట్టి మరమ్మతులు చేయించాలని జిల్లా కలెక్టర్ ను కోరగా… అందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ తప్పకుండా చేయిస్తామని తెలిపారు.
అంతేకాకుండా పేరూరు చెరువులో ఉన్న నీటిని గ్రావిటీ పంప్స్ ద్వారా తుమ్మలగుంట మీదుగా అవిలాల చెరువులోకి అనుసంధానం చేయాలని కోరారు. ఖనిజ వనరుల శాఖకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో భాగంగా వాడుతున్న గ్రావెల్ కు సదరు శాఖ నుంచి డి.పి అనుమతులు ఇప్పించవలసిందిగా సదురు శాఖ ఏడిని కోరారు. అలాగే
చంద్రగిరి నియోజక వర్గంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే పులివర్తి నాని ఈ సమీక్ష సమావేశం ముందుంచారు.
ఇందులో భాగంగా గత వైసీపి ప్రభుత్వం జగనన్న కాలనీలలో ఇచ్చిన ఇంటి పట్టాల్లో లబ్ధిదారుల చేతికి పట్టాలు అందజేశారే గాని వారికి స్థలాలు చూపించలేదు. ముఖ్యంగా చిందేపల్లి, ఇతర మండలాలలో పరిస్థితి అలాగే ఉందన్నారు.
రాష్ట్ర పండగ దినోత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారో… అలాగే తిరుపతిలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి మాస్టర్ ప్లాన్ అప్రోచ్ రోడ్స్ త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. తిరుపతి చుట్టుపక్కల ఉన్న పాడిపేట , తనపల్లి, రామాపురం బ్రిడ్జిలను పూర్తి చేయాలని కోరారు.
తిరుపతి గ్రామీణ మండలంలోని తుమ్మలగుంట, అవిలాల, పేరూరు, పరిసర ప్రాంతాలలో ఉన్న మఠం భూములను తిరుమల తిరుపతి దేవస్థానమునకు లీజు ప్రతిపాదికన అందజేసి సదరు ఆదాయమును మఠం వారికి అందజేయవలసిందిగా కోరారు. పాకాల, చిన్నగొట్టిగల్లు, తిరుపతి గ్రామీణ మండలాలలో పెరికబలిజ కులస్తులకు క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇవ్వనందున సదరు సర్టిఫికెట్స్ ను మంజూరు చేయవలసిందిగా మంత్రికి, జిల్లా కలెక్టర్ కు విన్నవించారు. తిరుపతి గ్రామీణ మండలానికి సంబంధించి చెర్లోపల్లి, మంగళం లో సరికొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీని మంత్రి అనగాని కోరారు. ఇళ్ల స్థలాలు లేని పేద ప్రజలకు రామచంద్రపురం మండలం సర్వేనెంబర్ 28, 96లో 200 ఎకరాలలో సుమారు 7000 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ను కోరారు.
చిన్నగొట్టిగల్లు, పాకాల, యర్రావారిపాలెం మండలాలలో పరిశ్రమలు, కళాశాలలు.. గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ పరంగా పాకాల, రామచంద్రపురం, చిన్నగొట్టిగల్లు మండలాలలో యూరియా కొరత ఉందని… పశువులకు దాణా సరిపోవడంలేదని అందుకు అనుగుణంగా ఫీడ్ బ్యాగ్స్ సరఫరా పెంచాలని, ఈ క్రాప్ బుకింగ్ చేసుకునేదానికి రైతులకు మరికొంత సమయం పెంచాలని… ఏనుగుల దాడిలో, తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించాలని కోరారు. ఎన్ఆర్ఇజిఎస్ పథకం కింద అందిస్తున్న గోకులం షెడ్ గ్రామీణ మండలాలలో రైతులకు చాలా లాభదాయకంగా, ఉపయోగకరంగా ఉందని రైతులు తెలియజేశారని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మండలాలకు మరికొన్ని గోకులం షెడ్లు పరిమితిలేకుండా ఇవ్వాలని కోరారు.
