తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

TEJA NEWS

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల కలెక్టరేట్ల ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం “తెలంగాణ రైజింగ్ – గ్లోబల్ సమ్మిట్ 2025” నిర్వహణ జరుగుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ వేదిక నుంచే జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , రాష్ట్ర మంత్రివర్గ సహచరులు పాల్గొన్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక శుభ పరిణామమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీల ఆశయాలను నెరవేర్చేందుకు తెలంగాణ తల్లిని స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతున్నదని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

అలాగే 2009 డిసెంబర్ 9న యూపీఏ చైర్‌పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ ఆధ్వర్యంలో, అప్పటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేసిన రోజును గుర్తు చేసుకున్నారు. ఆ నిర్ణయం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించి వారికి ఆత్మగౌరవాన్ని అందించిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం డిసెంబర్ 9 ప్రాధాన్యతను మరింత గుర్తించి, ఈ తేదీన తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా ప్రతి ఏడాది ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. గత ఏడాది రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించగా, ఈ ఏడాది అన్ని జిల్లా కలెక్టరేట్లలో విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో నూతన స్ఫూర్తిని నింపినట్లు చెప్పారు.

స్వరాష్ట్ర కల నిజమై, తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top