దుబ్బాకలో నూతన ప్రజాప్రతినిధులకు మంత్రి వివేక్ వెంకటస్వామి సన్మానం
కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయి: మంత్రి
దుబ్బాక నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులను కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తూ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా చేపట్టామని చెప్పారు.
దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 56 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించడం శుభపరిణామమని పేర్కొన్న మంత్రి, ఇది ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లు నాణ్యంగా నిర్మాణం అవుతున్నాయని, ఈ పథకం ద్వారా మరింత మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరాలంటే స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభిస్తే తదుపరి దశలో మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. అలాగే చేగుంటలో డిగ్రీ కళాశాల మంజూరు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని, ఇందిరమ్మ ‘గరీబీ హటావో’ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇందిరమ్మ పథకాన్ని పునఃప్రారంభించారని తెలిపారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తల అంకితభావ కృషి వల్లనే నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి తెలిపారు. దుబ్బాక ప్రాంతంలో బీఆర్‌ఎస్ ఓటు శాతం 17 శాతానికి పడిపోయిందని, ఇది కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో మరింత బలమైన అవకాశంగా మారుతుందని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
