నిద్రావస్థలో ఎలక్షన్ కమిషన్–డబ్బుతో, మద్యంతో కొనబడుతున్న ప్రజాస్వామ్యం
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: ప్రజాస్వామ్యంలో ఓటు అనేది సామాన్యుడికి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం.
అయితే నేడు ఆ ఓటు విలువ మద్యం బాటిళ్లకు, నోట్ల కట్టలకు తాకట్టు పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికల్లో మద్యం, డబ్బు విపరీతంగా పంపిణీ అయ్యాయి. ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన ఖర్చు పరిమితులకు విరుద్ధంగా, అభ్యర్థులు వందల రెట్లు అధికంగా ఖర్చు పెట్టినట్లు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ సంబంధిత సంస్థల నుంచి కఠిన చర్యలు కనిపించకపోవడం ప్రజల్లో అనేక సందేహాలకు దారి తీస్తోంది. కేవలం వారం నుంచి పది రోజుల్లోనే కోట్ల రూపాయల విలువైన మద్యం సీజ్ కావడం, ఎన్నికల సమయంలో ఓటర్లకు ఎంత స్థాయిలో మద్యం సరఫరా జరిగిందో తెలియజేస్తోంది. మద్యం మాత్రమే కాకుండా నగదు పంపిణీ కూడా విస్తృతంగా జరిగినా, వాటిని అడ్డుకునే ప్రయత్నాలు తగిన స్థాయిలో జరగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ వంటి స్థానిక పదవులకే లక్షల నుంచి కోట్ల వరకు ఖర్చు అవుతోందన్న భావన సమాజంలో స్థిరపడిపోయింది. గెలవాలన్న తపనలో అభ్యర్థులు తమ ఆర్థిక సామర్థ్యానికి మించి ఖర్చు చేయడం వల్ల, ఓడిన తరువాత తీవ్ర మానసిక, ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. కొన్నిచోట్ల ఇది ప్రాణాంతక పరిస్థితులకు దారి తీసిందన్న వాస్తవాలు కూడా మనల్ని ఆలోచింపజేయాల్సిన అంశాలు. ఈ పరిస్థితుల వల్ల నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనుకునే సామాన్యులు రాజకీయాల నుంచి దూరమవుతున్నారు. డబ్బున్నవారు, బలిసినవారే ఎన్నికల్లో నిలబడి గెలిచే పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి, సమాజ భవిష్యత్తుకు తీవ్ర నష్టం. ఎలక్షన్ కమిషన్ గనుక చట్టానికి మించి ఖర్చు చేసిన అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటే, ఎన్నికల్లో ఖర్చు చేసే సంస్కృతి తగ్గే అవకాశం ఉంది. అప్పుడు సామాన్యుడికి కూడా ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం వస్తుంది. చట్టంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. ఒకప్పుడు టి.ఎన్. శేషన్ కాలంలో ఎన్నికల అక్రమాలపై కఠిన వైఖరి కనిపించేది.
నేడు అలాంటి భయం అభ్యర్థుల్లో కనిపించడం లేదు. ప్రజాప్రతినిధుల ఆస్తులు పదవీకాలం పూర్తయ్యేలోపు అనూహ్యంగా పెరుగుతున్నాయన్న ఆరోపణలపై కూడా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. డబ్బుతో కొనబడుతున్న ఓటు ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు. ఎన్నికలు నిజంగా ప్రజల పండుగగా మారాలంటే, అవినీతి లేని వాతావరణం అత్యవసరం. ఇందుకు ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ తక్షణమే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇది ఒక్కరి అభిప్రాయం కాదు — కోట్లాది మంది పౌరుల ఆవేదన.
— కుసుమ సిద్ధారెడ్డి
జాతీయోద్యమ ప్రచారకులు, సూర్యాపేట
