మేడారం జాతర స్పెషల్ బస్సుల్లో వికలాంగుల పాసులకు అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గం
సీఎం రేవంత్ రెడ్డి పాలనపై గిద్దె రాజేష్ తీవ్ర ఆగ్రహం
వికలాంగులపై వివక్ష చూపుతున్న కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం తప్పదు
సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో వికలాంగుల పాసులకు అనుమతి ఇవ్వకపోవడంపై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా గంగారం మండల కేంద్రంలో నిర్వహించిన సంఘం సమావేశంలో పాల్గొన్న గిద్దె రాజేష్ మాట్లాడుతూ…
మహిళల ఆధార్ కార్డులను, జర్నలిస్టు పాసులను అనుమతిస్తూ, ఆర్టీసీలో 50 శాతం రాయితీ కలిగిన వికలాంగుల పాసులను మాత్రం మేడారం స్పెషల్ బస్సుల్లో అనుమతించకపోవడం అత్యంత అన్యాయమని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఎన్నో హామీలు ఇచ్చిందని,
✔ వికలాంగుల పింఛన్లు పెంచుతామని
✔ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని
✔ అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని
✔ బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని
✔ వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేస్తామని
ప్రకటనలు చేసి వికలాంగుల ఓట్లు పొందారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ హామీలను నెరవేర్చకపోవడమే కాకుండా అడుగడుగున వికలాంగులపై వివక్ష చూపుతున్న తీరు బాధాకరమని గిద్దె రాజేష్ విమర్శించారు. ముఖ్యంగా సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే వికలాంగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వారి పాసులను అనుమతించకపోవడం వికలాంగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఇలాంటి వైఖరి కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు. వికలాంగుల సమాజం ఈ అన్యాయాన్ని మౌనంగా భరించదని, తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
