మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు గుర్తు

TEJA NEWS

మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు గుర్తు కేటాయింపుల్లో జాగ్రత్త వహించాలి……….. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

వనపర్తి
మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పోటీ చేయబోయే అభ్యర్థులకు గుర్తు కేటాయింపు ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

       కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ఉపసంహరణ మరియు గుర్తుల కేటాయింపుపై జిల్లా కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు. 

         కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేసి పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు స్వయంగా వచ్చి ఉపసంహరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందన్నారు. అలా కాకుండా ప్రతిపాదిత వ్యక్తి లేదా ఏజెంట్ ఉపసంహరణ పత్రం సమర్పించినట్లయితే, అధికారులు తప్పనిసరిగా అభ్యర్థికి ఫోన్ చేసి నిర్ధారించుకోవడమే కాకుండా పత్రాలపై ఉన్న సంతకాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. 

        అభ్యర్థుల ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం 3:00 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఈ సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరణలు అంగీకరించబడవని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పోటీ చేయబోయే అభ్యర్థులకు గుర్తు కేటాయింపు ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం 4:00 గంటలకు అభ్యర్థులతో సమావేశం నిర్వహించి, వారికి ఎన్నికల గుర్తులను కేటాయించడం జరుగుతుందన్నారు. 

           అదేవిధంగా పోలింగ్ మరియు కౌంటింగ్ కు సంబంధించి అభ్యర్థుల ఏజెంట్లందరికీ అవసరమైన గుర్తింపు కార్డులను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఒక అభ్యర్థికి ఒక ఏజెంట్ కు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ తమకు కేటాయించిన హ్యాండ్‌బుక్‌ను క్షుణ్ణంగా చదివి నియమ నిబంధనలు తెలుసుకోవాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న రిటర్నింగ్ ఆఫీసర్లు పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారమ్-12 ని నింపి వెంటనే సమర్పించాలని సూచించారు. ​అర్హులైన వారు ఈ నెల 8వ తేదీన తమ పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకోవచ్చన్నారు. 

          సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, డిప్యూటీ సీఈవో రామ మహేశ్వర్ రెడ్డి, టీ వో టి శ్రీనివాసులు, ఆర్వోలు, ఏఆర్వోలు ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top