బూతుల రాజకీయాల వెనుక అసలు కుట్రలు – అభివృద్ధిని అడ్డుకునే వైకాపా ‘డైవర్షన్’ రాజకీయం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు వైకాపా నాయకులు వాడుతున్న భాష కేవలం దూషణ కాదు.. అది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడానికి పన్నే ఒక ప్రమాదకరమైన కుట్ర అన్న విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలని ప్రభుత్వ విప్ శ్రీమతి తంగిరాల సౌమ్య హెచ్చరించారు.
నందిగామలో ఒక పత్రికా ప్రకటన ద్వారా గత కొద్దిరోజులుగా వైకాపా నీచ రాజకీయాలను ఎండగడుతూ విడుదల చేసిన ప్రకటన…
11 సీట్లకు పడిపోయినా మారని వైసీపీ బూతుల బుద్ధి!
“జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ బూతుల రాజకీయాలనే నమ్ముకున్నారు. మంత్రుల చేత చంద్రబాబు నాయుడు ని, పవన్ కళ్యాణ్ ని లోకేష్ ని నిరంతరం తిట్టిస్తూ, కులాల మధ్య ఉద్వేగాలు సృష్టించి ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తూ ‘వై నాట్ 175’ అంటూ విర్రవీగారు. ఫలితంగా ప్రజలు ఆ పార్టీకి కర్రు కాల్చి వాతలు పెట్టి, కేవలం 11 సీట్లకే పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు.
ప్రజలు మీ బూతులను, కుట్రలను చీత్కరించుకున్నారని తెలిసినప్పటికీ.. ఈరోజు కూడా అదే పంథాలో వెళ్లడం చూస్తుంటే మీలో మార్పు రాదని, ఆంధ్రప్రదేశ్ ప్రశాంతతకు, అభివృద్ధికి మీరే పెద్ద శత్రువులని మీరే స్పష్టం చేసుకుంటున్నారని” వ్యాఖ్యానించారు.
భాషా పతనం: ఇది వ్యక్తిపై దాడి కాదు.. వ్యవస్థపై దాడి!
“ప్రజాస్వామ్యంలో విమర్శ పదునైన ఆయుధం కావాలి కానీ, అది మురికి కాలువలా ప్రవహించకూడదు. అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి వారు ముఖ్యమంత్రి గారిపై వాడుతున్న అన్ పార్లమెంటరీ అసభ్య పదజాలం వారి సంస్కార హీనతకు పరాకాష్ట.
హైకోర్టు ‘మర్యాద ఇస్తేనే మర్యాద దక్కుతుంది’ అని మొట్టికాయలు వేసినా మారకపోవడం చూస్తుంటే… అలాంటి వారిని సమర్థిస్తున్న జగన్ రెడ్డి తీరు చూస్తుంటే ప్రజలకు రాజకీయాల పట్లే చులకన భావం కలిగే ప్రమాదం ఉందని అన్నారు.
‘కులం’ కార్డు: తప్పులు దాచుకోవడానికి సామాజిక వర్గాలను వాడుకుంటారా?
“తమ నేరాలు, ఘోరాలు బయటపడగానే కులాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని చూడటం వైకాపా నాయకులకు అలవాటుగా మారింది. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆయా కులాల అభివృద్ధి కోసం కించిత్ పని కూడా చేయని ఈ నాయకులు, ఇప్పుడు చట్టం తన పని తాను చేస్తుంటే ఆ కులాల వెనుక దాక్కోవడం సిగ్గుచేటు. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని మొత్తం కులానికి ఆపాదించి, సమాజంలో వర్గాల మధ్య ఘర్షణలు సృష్టించాలని చూడటం మీ దుష్ట బుద్ధికి నిదర్శనం. మీ దుర్బుద్ధితో చేసిన తప్పును కులం వెనుక దాచడం అంటే.. ఆ కులాన్ని గౌరవించడం కాదు, నిలువునా అవమానించడమే!
ఇటువంటి చవకబారు కుల రాజకీయాలు ప్రజల ముందు పారవని, ఇప్పటికే జనం మీకు చెప్పుతో కొట్టినట్లుగా బుద్ధి చెప్పినా మీలో మార్పు రాకపోవడం విచారకరం.”
.అభివృద్ధిపై గొడ్డలిపెట్టు: సంక్షోభం సృష్టించడం జగన్ రెడ్డి లక్ష్యం!
“చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ లోకేష్ రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మారుస్తుంటే, దానిని సహించలేక జగన్ రెడ్డి తన నాయకులను బూతులతో రెచ్చగొడుతున్నారు.
రాష్ట్రంలో ఎప్పుడూ అశాంతి ఉందనే సంకేతాలు పంపి పరిశ్రమలు రాకుండా చేయాలని, అభివృద్ధి చర్చను దారి మళ్లించాలని, మిడియాలో రాష్ట్ర అభివృద్ధి వార్తలకి చోటు కూడ లభించకుండా పన్నుతున్న కుట్ర ఇది.
తన నాయకులు నోరు పారేసుకుంటున్నా నిలువరించని, మందలించని జగన్ రెడ్డి వైఖరి చూస్తే అభివృద్ధి కంటే తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది.
హుందాతనం వర్సెస్ అరాచకం: ఇద్దరు నాయకుల మధ్య తేడా ఇదే!
“ఒకవైపు తన నాయకులను బూతులకు పురికొల్పుతున్న జగన్ రెడ్డి..
మరోవైపు అవమానాలను దిగమింగి ‘మనం ఆ బురద గుంటలోకి దిగొద్దు, మీకూ బురద అంటే పరిస్థితి వస్తుందని’ అని కార్యకర్తలను వారించే చంద్రబాబు నాయుడు మరోవైపు…
పార్టీ శ్రేణుల ఆవేశాన్ని తగ్గించి, రాష్ట్ర శాంతిభద్రతలే ముఖ్యమని భావించే ఆయన రాజనీతిజ్ఞతకు,
అరాచకాన్ని పెంచి పోషించే జగన్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
చట్టాన్ని గౌరవించే సంస్కృతి చంద్రబాబు ది అన్న వాస్తవం ఈరోజు ఆచరణలో కనబడుతున్నది…
నందిగామ శ్రేణులకు పిలుపు: సంయమనమే మన ఆయుధం!
“ఇంతటి ఉద్రేక పరిస్థితుల్లోనూ వైకాపా పన్నిన ఉచ్చులో చిక్కుకోకుండా, ఎంతో సహనంతో, సంయమనంతో ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు వ్యక్తపరిచిన నందిగామ నియోజకవర్గ కూటమి నాయకులకు, కార్యకర్తలకు అభినందనలతో…. వైకాపా నాయకులు ఆడుతున్న కుల రాజకీయాలను, వారి కుతంత్రాల వెనుక ఉన్న అసలు లక్ష్యాలను అలాగే మన అధినేతలు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న తీరును, ప్రగతి పథంలో ఏపీ దూసుకుపోతున్న వాస్తవాలను గ్రామ గ్రామాన అన్ని వేదికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
“దూషణతో సత్యాన్ని దాచలేరు, కుట్రలతో అభివృద్ధిని ఆపలేరు”
ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు.. అరుపులకు-అభివృద్ధికి, బూతులకు-భవిష్యత్తుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వారు ఇప్పటికే గుర్తించారు. ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు, వైసీపీ నాయకుల కుట్రలు ప్రజాక్షేత్రంలో మట్టికరిచి తీరుతాయి.”
