శ్రీవారి వైద్యసేవపై త్రివేండ్రం డాక్టర్ పరిశీలన

TEJA NEWS

శ్రీవారి వైద్యసేవపై త్రివేండ్రం డాక్టర్ పరిశీలన

తిరుపతి: తిరువనంత పురానికి (త్రివేండ్రంకు) చెందిన గౌరవ వేతనరహిత అధ్యాపక వైద్యురాలు డా. రాధా వెంకటేశన్ శ్రీవారి వైద్యసేవ కార్యక్రమంలో భాగంగా స్విమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రిలోని నొప్పి, పాలియేటివ్ కేర్ విభాగాన్ని సందర్శించారు. రేడియేషన్ ఆంకాలజీ విభాగ ప్రొఫెసర్ అండ్ పాలియేటివ్ కేర్ విభాగ ఇన్-చార్జ్ డా. ప్రాణబంధు దాస్ తోనూ, సంబంధిత వైద్య బృందంతోనూ విస్తృతంగా చర్చలు నిర్వహించారు. ప్రస్తుత నొప్పి, పాలియేటివ్ కేర్ సేవల అమలు విధానాల గురించి వాటిని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ చర్చలు కేంద్రీకృత మయ్యాయి. నొప్పి, పాలియేటివ్ కేర్ సేవలను మెరుగుపరచేందుకు అవసరమైన విలువైన సూచనలు, నిపుణుల మార్గదర్శకత్వాన్ని డా. రాధా వెంకటేశన్ అందించారు. రోగి కేంద్రిత, సమగ్ర, కరుణతో కూడిన సంరక్షణ విధానం ఎంతో అవసరమని ఆమె ప్రత్యేకంగా పేర్కొన్నారు.

అదేవిధంగా, హాస్పీస్ కేర్‌లో భాగంగా వృద్ధుల సంరక్షణను మరింత అభివృద్ధి చేయడానికి అవసరమైన పలు ప్రాయోగిక సూచనలు, మార్గదర్శకాలను ఆమె వివరించారు. వృద్ధుల వైద్య, మానసిక, సామాజిక అవసరాలను సమగ్రంగా తీర్చే విధంగా జెరియాట్రిక్ కేర్ సేవలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు.
డా. రాధా వెంకటేశన్ సందర్శన ద్వారా ఆమె అందించిన సూచనలు స్విమ్స్ ఆసుపత్రిలో నొప్పి, పాలియేటివ్, హాస్పీస్ అండ్ వృద్ధుల సంరక్షణ సేవల అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని భావిస్తున్నారు. ఈ సందర్బంగా స్విమ్స్ సంచాలకులు డా.ఆర్.వి. కుమార్ డా. రాధా వెంకటేశన్ ను శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు.

You cannot copy content of this page

Scroll to Top