కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలు చెల్లించి. వారి కుటుంబాన్ని ఆదుకోండి.
శాసనసభలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
15 ఏళ్లుగా మూతపడి వేలాది కుటుంబాలను రోడ్డున పడేసిన షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శాసనసభలో గళమెత్తారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో దాదాపు 3 వేల మంది కార్మికులు పని చేసేవారని న్యాయం కోసం పోరాడుతూ ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటివరకు సుమారు 2 వేల మంది వరకు మరణించడం అత్యంత బాధాకరమంటూ కార్మికుల దయనీయ స్థితిని సభలో ప్రస్తావించారు. ప్రస్తుతం జీవించి ఉన్న దాదాపు వెయ్యి మంది వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బకాయిల కోసం ఎదురు చూస్తున్నారని షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల దయనీయ పరిస్థితులపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కోట్లాది రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి మరియు పరిశ్రమల శాఖ మంత్రి మానవతా దృక్పథంతో సానుకూలంగా స్పందించి షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలను త్వరితగతిన చెల్లించి ఆదుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మనవి చేశారు.
