స్విమ్స్ లో ఘనంగా వరల్డ్ ఉమెన్స్ డే
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) లో పద్మావతి ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు స్విమ్స్ ఇంచార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ డా. వెంకట కోటిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిలుగా టిటిడి పాలకమండలి సభ్యులు డాక్టర్.పనబాక లక్ష్మి, ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఎం. సుగుణమ్మ, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ వి కుమార్, డీన్ డాక్టర్.అలోక్ సచిన్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్.శిల్పా కడియాల, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ .ఉషా కళావత్, అలాయిడ్ హెల్త్ సెన్స్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బి సురేష్ బాబు, కాలేజ్ అఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ డా. సుధారాణి, కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరఫీ ప్రిన్సిపాల్ డా. కె. మాధవి, బయో ఇన్ఫర్మేటిక్స్ విభాగాధిపతి డాక్టర్. ఉమామహేశ్వరి, మైక్రో బయాలాజీ హెచ్ఓడీ డాక్టర్ బీవీ రమణ సంయుక్తంగా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు.
స్విమ్స్ సంచాలకులు డా. ఆర్.వి.కుమార్ ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతర్జాతీయంగా మహిళలు తమ హక్కులను గుర్తించి మహిళా సమానత్వం, సాధికారత, సామాజిక మార్పు పై అవగాహనతో పాటు సాధన కోసం ఉద్యమించాల్సిన కర్తవ్యాన్ని గుర్తుచేసుకొనే ఆవశ్యం ఎంతైనా ఉందని తెలియజేసారు. మన స్విమ్స్ హాస్పిటల్ లో కూడా మహిళా ఉద్యోగినిలు 60 శాతం మందితో పనిచేస్తుండడం గర్వకారణం అని తెలిపారు. టిటిడి పాలకమండలి సభ్యులు డాక్టర్.పనబాక లక్ష్మి మాట్లాడుతూ.. స్త్రీ అంటే ఒక అమ్మగా శక్తిగా గౌరవిస్తారని స్త్రీ అంటే వంటగదికే పరిమితం కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్క రంగాలలో మహిళలు రాణిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ (పి -4) ద్వారా భాగ్యస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సుగుణమ్మ మాట్లాడుతూ…మహిళలు అన్ని రంగాల్లో ఆర్ధిక పురోగతి సాధించేలా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని దీనిని మహిళలు సద్వినియోగం చేసుకొని స్వయం శక్తితో ఎదగాలని కోరారు. కుటుంబంలో స్త్రీ పురుషులు సమాన బాధ్యతలు తీసుకోవాలని అప్పుడే కుటుంబ వ్యవస్థ బ్యాలెన్సింగ్ వుంటుందని తెలిపారు. మహిళా హక్కులు, సమానత్వం, సాధికారత వైపు మహిళలు మరింత పురోగమించాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయ పడ్డారు.
