ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛత కార్యక్రమం….

TEJA NEWS

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛత కార్యక్రమం….

పెద్దపల్లి//గోదావరిఖని: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లకు చెందిన పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సమిష్టిగా పాల్గొని స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు.

ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది స్వయంగా శ్రమదానం చేస్తూ స్టేషన్ లోపల, వెలుపల ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించారు. అలాగే స్టేషన్ ఆవరణలో అస్తవ్యస్తంగా పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను తొలగించి ప్రాంగణాన్ని శుభ్రపరిచారు. స్టేషన్‌లోని రికార్డులను కూడా క్రమపద్ధతిలో సర్దుతూ దుమ్ము, ధూళి లేకుండా శుభ్రపరిచారు.

విధి నిర్వహణలో నిరంతరం బిజీగా ఉండే పోలీస్ సిబ్బంది సామాజిక బాధ్యతగా భావించి, ఈ స్వచ్ఛత కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం విశేషంగా నిలిచింది.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, ప్రజలకు ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సమస్యలతో స్టేషన్‌కు వచ్చే ప్రజలు పరిశుభ్రమైన వాతావరణాన్ని చూసి మానసిక ప్రశాంతత పొందేలా ఉండాలని, అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వచ్ఛత దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు.

పరిశుభ్రమైన వాతావరణం పని ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ప్రజల్లో పోలీసుల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top