
ఆస్తి, నీటి పన్నుల బకాయిలను వసూళ్లు చేయాలని కమీషనర్లను ఆదేశించిన……. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
వనపర్తి
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి, నీటి పన్ను బకాయిల వసూళ్లలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు
జిల్లా కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా నాయక్ తో కలిసి జిల్లాలోని 5 మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి, నీటి పన్ను వసూళ్లను ముమ్మరం చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన రోజు వారి లక్ష్యాలను అనుగుణంగా కలెక్షన్లను చేయాలని మున్సిపల్ అధికారులకు సిబ్బందికి సూచించారు. పన్ను బకాయి ఉన్న వారి జాబితాను వార్డుల వారీగా సిద్ధం చేయాలని, ఈ జాబితాను సంబంధిత వార్డు కౌన్సిలర్లకు కూడా అందజేయాలని ఆదేశించారు.
పన్ను బకాయిలు ఉన్న వారి జాబితాలను తయారు చేసి వారికి డిజిటల్ పేమెంట్ చేయడం కోసం బార్ కోడ్ కలిగి ఉన్న నోటీసులను తయారుచేసి వారికి పోస్ట్ ద్వారా పంపించాలని ఆదేశించారు. అదేవిధంగా వార్డ్ ఆఫీసర్లు బిల్ కలెక్టర్ల ద్వారా కూడా ఇంటింటికి నోటీసులను చేరవేయాలని సూచించారు. నోటీసులను చేరవేసి పన్నులను రాబట్టడంలో కౌన్సిలర్ల సహకారాన్ని కూడా తీసుకోవాలని సూచించారు.
ఆస్తి పనులకు సంబంధించి అత్యధిక మొత్తంలో పెండింగ్ ఉన్న బకాయిదారుల జాబితాను టాప్ 1000 లిస్ట్ సిద్ధం చేసి వారికి నోటీసులు పంపడంతో పాటు, బల్క్ ఎస్ఎంఎస్ లు కూడా పంపాలని ఆదేశించారు. ఈ అత్యధిక బకాయిలు ఉన్న వారిని మున్సిపల్ కమిషనర్లు ప్రతిరోజు పర్యవేక్షణ చేసి బకాయిలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
అదేవిధంగా పన్నుల వసూళ్ల కోసం ప్రతి మూడు వార్డులకు ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి పర్యవేక్షణ కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు నిర్దేశించిన లక్ష్యాల మేరకు పన్నుల వసూలు చేసి ఆదాయాన్ని రాబట్టాలన్నారు. తద్వారా ఆదాయాన్ని మున్సిపాలిటీ అభివృద్ధి కోసం వినియోగించడానికి అవకాశం ఉంటుందని సూచించారు. వనపర్తి మున్సిపాలిటీలో ఈ సంవత్సరం రూ.7 కోట్ల వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవాల్సిందిగా కలెక్టర్ సూచించారు.
పన్ను చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు డిజిటల్ మోడ్ ను ప్రోత్సహించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
రివిజన్ మేళాల నిర్వహణ తప్పనిసరి
అన్ని మున్సిపాలిటీలలో ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పన్ను చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ‘రివిజన్ మేళా’ నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మ్యుటేషన్లు, కొత్త ఇంటి నంబర్ల జారీ వంటి పనులు వేగంగా కొనసాగించాలని ఆదేశించారు. పన్ను వసూళ్ల పై ప్రతిరోజు పర్యవేక్షణ కొనసాగించి ప్రతిరోజు నివేదిక అందించవలసిందిగా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఆదేశించారు. ఈ రాబోయే 13 రోజులు తప్పనిసరిగా ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా శ్రమించాలని సూచించారు
సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, ఐదు మున్సిపాలిటీల కమిషనర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.