
గ్రామీణ సేవకు అరుదైన గౌరవం
అసిస్ట్ డైరెక్టర్ రంగారావుకు ‘కళారత్న’ పురస్కారం
చిలకలూరిపేట: ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘అసిస్ట్’ డైరెక్టర్ జాష్టి రంగారావు ప్రతిష్టాత్మకమైన ‘కళారత్న’ (హంస)పురస్కారాన్ని అందుకున్నారు. ఉగాది పురస్కారాల్లో భాగంగా సాంఘిక సేవా విభాగంలో ఆయనను ఈ అవార్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. విజయవాడలో నిర్వహించిన వేడుకలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పురస్కారం లభించడం పట్ల చిలకలూరిపేట ప్రాంతంతో పాటు సేవా రంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
గత 50 ఏళ్లుగా అసిస్ట్ సంస్థ ద్వారా రంగారావు గ్రామీణాభివృద్ధి కోసం అలుపెరగని కృషి చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలతో పాటు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని సుమారు 351 గ్రామాల్లో తన సేవా కార్యక్రమాలను విస్తరించారు. ముఖ్యంగా గ్రామాల్లో సాగు, తాగునీటి వనరుల అభివృద్ధి, మహిళా సాధికారత, వృద్ధులకు సామాజిక భద్రత కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే యువతకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు, 2004-05లో రోటరీ జిల్లా గవర్నర్గా కూడా విశేష సేవలు అందించారు. అర్థ శతాబ్దపు ఆయన నిరంతర సేవకు దక్కిన సరైన గుర్తింపుగా ఈ ‘కళారత్న’ పురస్కారాన్ని ప్రముఖులు కొనియాడుతున్నారు.