ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి

TEJA NEWS

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి…

ప్రభుత్వ కార్యాలయాల్లో పనికి రాని పాత సామాగ్రి తొలగించాలి…

-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…

పెద్దపల్లి// .ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ పై అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాల్లో స్టాఫ్ కదలికల పై జిల్లా అధికారులు పక్కా నిఘా ఉంచాలని , కార్యాలయ విధులకు సకాలంలో హాజరు కావాలని, సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన పక్షంలో దానికి సంబంధించిన వివరాలతో కూడిన రికార్డు మెయింటెన్ చేయాలని అన్నారు.

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా చేపట్టిన పెండింగ్ ఫైల్స్ సత్వర పరిష్కారం ఆశించిన పురోగతి సాధించ లేదని అన్నారు. ప్రతి కార్యాలయం సంబంధించి పెండింగ్ ఫైల్స్ డిస్పోజల్, వివరాలతో కూడిన రిపోర్ట్ అందించాలని అన్నారు. ప్రతి కార్యాలయంలో పాత కంప్యూటర్, సామాగ్రి పూర్తి స్థాయిలో తొలగించాలని అన్నారు.

కోర్టు కేసుల మానిటరింగ్ కోసం ఏర్పాటు చేసిన సి.సి.ఎం.ఎస్. సిస్టం ను అధికారులు వినియోగించాలని, సి.సి.ఎం.ఎస్ లో ప్రతి శాఖ తమ పరిధిలో పెండింగ్ ఉన్న కోర్టు కేసులను నమోదు చేయడంతో పాటు, సంబంధిత కేసులలో జరిగే పురోగతి వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో విద్యా సంస్థలను తనిఖీ చేస్తూ పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని అన్నారు.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రతి శాఖ ఫీల్డ్ లెవెల్ ఇన్స్ పెక్షన్ చేయాలని కలెక్టర్ సూచించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గా నియమితులయ్యారని, ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ ఎమ్మెల్యేల కంటే ప్రభుత్వ విప్ ముందు ఉంటారని, అభివృద్ధి పనులకు సంబంధించి శిలా ఫలకాలు ఏర్పాటు చేసే సమయంలో ఒక్కసారి రెవెన్యూ అధికారులతో ప్రోటోకాల్ ఫైనల్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పంచాయతి అధికారికి సూచించారు. త్రాగునీటి సరఫరా మెరుగ్గా అందించేందుకు గ్రామాల్లో ఉన్న నీటి సరఫరా పథకాలు మరమ్మత్తు ప్రాధాన్యత ప్రకారం చేపట్టాలని అన్నారు. గ్రామాలలో చేపడుతున్న త్రాగునీటి సరఫరా పనులకు సంబంధించి ప్రచారం సరిగ్గా ఉండాలని, ఓ.హెచ్.ఎస్.ఆర్ నిర్మాణం చేపడితే స్థానిక ఎమ్మెల్యే లేదా ప్రజా ప్రతినిధులు ఆహ్వనించి శంకుస్థాపన చేయాలని అన్నారు.

263 గ్రామ పంచాయతీలకు శాస్త్ర వేత్తలతో కూడిన 10 బృందాలు పర్యటించి పంట మార్పిడి విధానం, ఆధునిక సాగు పద్ధతులు, యూరియా వాడకం తగ్గింపు వంటి పలు అంశాల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఆర్.బి.ఎస్.కే బృందాల ద్వారా మార్చి నెలాఖరు నాటికి గురుకుల విద్యార్థులు వైద్య పరీక్షలు పూర్తి చేయాలని అన్నారు. గ్రామాలలో ప్రత్యేక వైద్య నిపుణులతో క్యాంప్ ఏర్పాటు చేసే సమయంలో ముందస్తుగానే ప్రచారం నిర్వహించే ప్రజలు ఆ క్యాంపు వినియోగించుకునేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక లో భాగంగా వైద్యశాఖ పరిధిలో ఏప్రిల్ 6 నుంచి 11 వరకు చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా రామగుండం క్రిటికల్ కేర్ సెంటర్, నంది మేడారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎస్సారెస్పీ పరిధిలో రైతులకు ఆఖరి తడి నీరు చివరి ఆయకట్టు వరకు అందేలా చూడాలని అన్నారు.విద్యాశాఖ పరిధిలో సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ తెలిపారు.

ఏప్రిల్ 2న. గ్రామ స్థాయిలో నిర్వహించే 99 రోజుల కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు, వివిధ పథకాల లబ్ధి వివరాలు గ్రామ సభ్యులలో చర్చ జరగాలని అన్నారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేస్తూ స్థానిక ఎమ్మెల్యే సమన్వయంతో పెద్ద ఎత్తున గృహ ప్రవేశాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. నగర ప్రాంతంలో నూతనంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ముగ్గు పోసే పనులు కూడా ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top