
భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో యువత ఉద్యమించాలి…
- గుజ్జుల సత్యనారాయణ రెడ్డి…
పెద్దపల్లి//ఎన్టీపిసి జ్యోతినగర్ :.సిపిఐ ఎం.ఎల్ మాస్ లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 95వ. వర్ధంతి సభను ఎన్టీపిసి ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం.ఎల్ మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ..బ్రిటిష్ పరాయి పాలనకు వ్యతిరేకంగా దేశ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ మరణించి 95 సంవత్సరాలు అయినప్పటికీ దేశంలో నిజమైన స్వాతంత్ర్యం లేదన్నారు.
భగత్ సింగ్ లాంటి పోరాట చైతన్యం కలిగిన యువతరం ఈ దేశానికి అవసరం అన్నారు. దేశంలో అధికారంలో ఉన్న మతోన్మాద బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న తప్పుడు చట్టాల మూలంగా దేశ సంపద మొత్తం కార్పోరేట్ శక్తుల చేతిలోకి వెళ్లిందన్నారు. దేశ వనరులను, దేశ సంపదను కార్పొరేట్ పెట్టుబడుదారులకు గంప గుత్తగా అప్పగించే దళారీ ప్రభుత్వాలను యువతరం ప్రశ్నించాలన్నారు.
ఒకపక్క సామ్రాజ్యవాదం, మరొక పక్క పెట్టుబడిదారీ విధానం వారి మధ్య జరుగుతున్న ఆధిపత్యం మూలంగా మూడో ప్రపంచ యుద్ధానికి పరిస్థితులు దారితీస్తున్నాయన్నారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను ఖండించాల్సిన భారత ప్రభుత్వం అమెరికాకు తొత్తుగా వ్యవహరిస్తుందన్నారు.
రాష్ట్రంలో, దేశంలో చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతూ ప్రజల జీవనం స్తంభించే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. మరో పక్క రాష్ట్రంలో, దేశంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత పెడదారిన పడుతుందన్నారు. ప్రభుత్వాలు, పాలకులు ఎన్నికల నాడు అనేక ఉచిత వాగ్దానాలను చేసి అమలు జరపడంలో విఫలం అవుతున్నారన్నారు.
దేశంలో స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కోసం మరో స్వాతంత్ర్య ఉద్యమానికి యువత సిద్ధం కావాలన్నారు. భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో పోరాడి దేశ భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం.ఎల్ మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులు తోకల రమేష్ ఈసంపల్లి రాజేందర్ , మార్త రాములు, కలువల రాయమల్లు, చిలుక రాజు, బత్తుల రాజన్న, అంబాల కిష్ట సామి, కోండ్ర రవి,తదితరులు పాల్గొన్నారు.