
హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక టీకా కార్యక్రమం ప్రారంభం
…..
సూర్యాపేట జిల్లా ప్రతినిధి:
హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పుండం వెంకట రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ, విదేశీ ప్రయాణ సమయంలో వాతావరణ మార్పులు, భిన్నమైన ఆహారపు అలవాట్లు వంటి కారణాలతో వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అందువల్ల హజ్ యాత్రకు వెళ్లే ప్రతి యాత్రికుడు ప్రభుత్వం సూచించిన టీకాలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెనింజిటిస్ టీకా (QMMV), ఇన్‌ఫ్లూయెంజా టీకా (SIV), పోలియో టీకా (bOPV)లను సుమారు 40 మంది యాత్రికులకు అందజేశారు.
ఈ టీకాల ద్వారా యాత్ర సమయంలో వ్యాధుల బారిన పడకుండా రక్షణ పొందవచ్చని వివరించారు. అలాగే యాత్రికులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, శుద్ధమైన నీరు మరియు ఆహారం తీసుకోవడం, మాస్క్ వినియోగం వంటి ఆరోగ్య నియమాలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. టీకా అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పించారు. హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఆరోగ్యంగా యాత్ర పూర్తి చేసి సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. టీకా కార్యక్రమం నిర్వహణలో సహకరించిన హజ్ కమిటీ సభ్యులు సాదిక్, ఇమామ్‌లకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ కోటి రత్నం, డాక్టర్ వాసవి, డాక్టర్ సనత్, విస్టీఎస్ లతీఫ్, డీవీఎల్‌యం నవకాంత్, ఆరోగ్య సిబ్బంది జానీబేగం, వజీర్ భాను, నసీమా, నేహా తదితరులు పాల్గొన్నారు.