నకిలీ ధృవపత్రాల సమర్పణపై చర్యలు

TEJA NEWS

నకిలీ ధృవపత్రాల సమర్పణపై చర్యలు

** 69 మంది షిఫ్ట్-ఆపరేటర్లను తొలగించాలని నోటీసులు

** ఏపీఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి
….

తిరుపతి: ఏపీఎస్పిడిసిఎల్ పరిధిలోని వివిధ సర్కిళ్ళలో ఉన్న సబ్-స్టేషన్లలో పొరుగు సేవల ద్వారా షిఫ్ట్-ఆపరేటర్ పోస్టుల నియామకాలకై నకిలీ ధృవ పత్రాలను సమర్పించిన వ్యక్తులపై చర్యలు తీసుకున్నట్లు ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి బుధవారం తెలిపారు. సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని సబ్-స్టేషన్లలో పొరుగు సేవల ద్వారా షిఫ్ట్-ఆపరేటర్ల పోస్టుల నియామకాల కోసం కొందరు అభ్యర్థులు నకిలీ ధృవ పత్రాలతో ఆ పోస్టులను పొందారని ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.

ఈ అంశంపై విచారణ నిర్వహించామని, తిరుపతి జిల్లా పరిధిలో ముగ్గురు, చిత్తూరు-4, నెల్లూరు-4, కడప-38, కర్నూలు-16, అన్నమయ్య-1, అనంతపురం జిల్లాలో ముగ్గురు కలిపి మొత్తం 69 మంది ఐటీఐ విద్యను అభ్యసించకుండానే ఐటిఐ (ఎలక్ట్రిషియన్) పూర్తి చేసినట్లు నకిలీ దృవపత్రాలను సమర్పించి, వాటి ద్వారా ఆ పోస్టులలో నియామకమైనట్లు విచారణలో వెల్లడైందని వివరించారు. ఈ నేపథ్యంలో నకిలీ ధృవ పత్రాలను సమర్పించిన 69 మంది షిఫ్ట్ ఆపరేటర్లను ఆ పోస్టుల నుంచి తొలగించాల్సిందిగా సంబంధిత ఏజెన్సీలకు నోటీసులు జారీ చేయాలని ఆయా సర్కిళ్ళ సూపరింటెండింగ్ ఇంజనీర్లను ఆదేశించినట్లు తెలియజేశారు.

You cannot copy content of this page

Scroll to Top