
6నుంచి “దండి మార్చ్ 2.0 సైకిల్ యాత్ర”
** పోస్టర్ల ఆవిష్కరణలో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు
….
తిరుపతి: మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం “దండి మార్చ్. 2.0” నినాదంతో డ్రగ్స్ నిర్మూలనకు ఈనెల 6వ తేదీ నుంచి 22వ తేదీవరకు సైకిల్ యాత్ర చేపట్టి యువతలో చైతన్యానికి నూతన దిశ ఏర్పరుస్తామని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు.
6వ తేదీ నుండి నిర్వహించనున్న “దండి మార్చ్ 2.0” సైకిల్ యాత్ర పోస్టర్ను ఈగల్ పోలీస్ ఆధ్వర్యంలో ఎస్పీ తమ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ యాత్ర శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ నుండి ప్రారంభమై 17 రోజుల పాటు 13 జిల్లాల ద్వారా సాగనుంది. ప్రజా చైతన్యం కోసం ఈ యాత్ర చేపట్టిన వైబ్రంట్స్ ఆఫ్ కలాం వ్యవస్థాపకులు విజయ్ కలాంని ఎస్పీ అభినందించారు. ఏప్రిల్ 6న జరిగే ప్రారంభ కార్యక్రమంలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొనాలని కోరారు. ఈ సందర్బంగా తిరుపతి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మహాత్మ గాంధీ స్ఫూర్తితో దేశ యువతలో మాదక ద్రవ్యాల పట్ల చైతన్యం కలిగించాలనే లక్ష్యంతో “వైబ్రంట్స్ ఆఫ్ కలాం” సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు సుమారు 1000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్ అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందని, ప్రతి పౌరుడు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత అని, సమాజం మొత్తం కలిసి ముందుకు వస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని ఎస్పీ స్పష్టం చేశారు. యువత దేశ భవిష్యత్తు అని పేర్కొంటూ, వారు తప్పుడు అలవాట్లకు లోనుకాకుండా తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని ఎస్పీ గారు సూచించారు. క్రీడలు, విద్య, సృజనాత్మక కార్యక్రమాల ద్వారా తమ శక్తిని సానుకూల దిశలో వినియోగించుకోవాలని, చెడు స్నేహితుల ప్రభావానికి లోనుకాకుండా జాగ్రత్తపడాలని అన్నారు.
డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీసులు మాత్రమే కాకుండా సమాజం మొత్తం కలసి పని చేయాల్సిన అవసరం ఉందని, యువతకు సరైన మార్గనిర్దేశం చేస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా మాత్రమే ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించగలమని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైబ్రంట్స్ ఆఫ్ కలాం వ్యవస్థాపకులు విజయ్ కలాం, అదనపు ఎస్పీ రవి మనోహర ఆచారి, రాష్ట్ర కోఆర్డినేటర్ రవిరాజు, ఈగల్ టీమ్ సీఐ ప్రసాద్, కమల్, నియోజకవర్గ కోఆర్డినేటర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.