
గ్యాస్ సరఫరా పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలి….
గ్యాస్ సరఫరా లో అంతరాయం లేకుండా సమన్వయంతో చర్యలు…
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…
పెద్దపల్లి// :జిల్లాలో గ్యాస్ సరఫరా పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ, గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ లో గ్యాస్ సరఫరా అంశంపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్లు జె. అరుణ శ్రీ, డి. వేణు, డిసిపి రాంరెడ్డి లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్యాస్ సరఫరా సంబంధించి జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) వైస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కమిటీలో జిల్లా అటవీ అధికారి, ఎన్.హెచ్.ఏ.ఐ ప్రాజెక్ట్ డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ కమిషనర్, ఐఓసిఎల్ ప్రతినిధి సహా మొత్తం 14 మంది సభ్యులు ఉంటారని తెలిపారు.
ఐఓసిఎల్ ఆధ్వర్యంలో జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో గ్యాస్ ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందులో సి.ఎన్.జి స్టేషన్లు, డొమెస్టిక్, ఇండస్ట్రియల్, కమర్షియల్ కనెక్షన్ల ఏర్పాటు జరుగుతోందన్నారు. రామగుండంలో 3 సి.ఎన్.జి స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రామగుండం నుంచి కరీంనగర్ వరకు 50 కిలోమీటర్ల పైపులైన్ పనులు ప్రారంభించగా, అందులో 20 కిలోమీటర్లు పూర్తయ్యాయని, మిగిలిన 30 కిలోమీటర్ల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
గ్యాస్ పైపుల ఏర్పాటుకు అనుమతులలో ఆలస్యం, రోడ్డు మరమ్మత్తు ఛార్జీలు, పని వేళల పరిమితులు వంటి అడ్డంకులను తొలగించి ప్రాజెక్టును వేగవంతం చేయడం కమిటీ ప్రధాన బాధ్యత అని తెలిపారు.
గ్యాస్ సరఫరా, నిల్వలు, పంపిణీ ప్రక్రియలో అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలని అధికారులకు ఆదేశించారు.
గ్యాస్ సరఫరా కు ఎలాంటి అంతరాయాలు లేకుండా సజావుగా కొనసాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జెడ్పి సీఈఓ నరేందర్, ఈ ఈ ఆర్ అండ్ బి బావ్ సింగ్ , జిల్లా పరిశ్రమల అధికారి కీర్తి కాంత్, మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్, మనోహర్, జిల్లా అటవీ శాఖ అధికారి, శివయ్య , జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.