చిన్న నిర్లక్ష్యపు చర్యతో రోడ్డు ప్రమాదాల ద్వారా కుటుంబం రోడ్డున పడుతుంది….

TEJA NEWS

చిన్న నిర్లక్ష్యపు చర్యతో రోడ్డు ప్రమాదాల ద్వారా కుటుంబం రోడ్డున పడుతుంది….

— రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా…

పెద్దపల్లి//రామగుండం: చిన్న నిర్లక్ష్యపు చర్యల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.

సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్రెపల్లి గ్రామంలో సర్పంచ్ వీరగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, జరిగిన ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ,ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్,సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు.ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.రోడ్డు దాటేటప్పుడు కచ్చితంగా నియమాలను పాటిస్తూ వాహనాలను గమనించాలని సూచించారు.

చిన్న పొరపాటు కూడా ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ, డ్రైవింగ్ చేయకూడదని పేర్కొన్నారు.

రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని,చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని తెలిపారు.ప్రతి ఇంటిలో పిల్లలకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు.

గ్రామాల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.గర్రెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కమిటీని సీపీ అభినందించారు.

కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి అంగవైకల్యం చెందినా లేదా మరణించినా,ఆ వ్యక్తిపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.ప్రమాదాల సమయంలో ‘గోల్డెన్ అవర్’ను సద్వినియోగం చేసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు.

హిట్ అండ్ రన్ కేసులు, ఇతర రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు ప్రభుత్వం రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నదని చెప్పారు.రాష్ట్రంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండగా, అనేక మంది అంగవైకల్యం చెందడం, మరణించడం జరుగుతుందని తెలిపారు.

ప్రమాదాల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటూ, పోలీస్,రవాణా,రోడ్డు శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ భద్రతా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.గత సంవత్సరం జిల్లాలో సుమారు 30 మంది బాధితులకు ఈ సహాయం అందించినట్లు పేర్కొన్నారు.రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలిస్తే పోలీస్ కేసుల్లో చిక్కుకుంటామనే అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు.

బాధితులను ఆసుపత్రికి తరలించిన వారికి ‘రహవీర్ పథకం’ కింద రూ.25,000 ప్రోత్సాహకం అందజేస్తామని తెలిపారు.
ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’గా పరిగణిస్తూ, ఈ సమయంలో సరైన వైద్యం అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనున్నట్లు తెలిపారు.ఈ పథకాలు త్వరలో అమల్లోకి రానున్నాయని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భషిరోద్దీన్,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీఐలు సుబ్బారెడ్డి, అనిల్ కుమార్, ఎస్సై చంద్రకుమార్, ఎంవీఐ మధు, సంబంధిత పోలీస్,ట్రాఫిక్,ఎంవీఐ సిబ్బంది, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top