వరి ధాన్యం కొనుగోలుకు శ్రీకారం, గింజ కటింగ్ లేదన్న ఎమ్మెల్యే విజయరమణారావు

TEJA NEWS

వరి ధాన్యం కొనుగోలుకు శ్రీకారం, గింజ కటింగ్ లేదన్న ఎమ్మెల్యే విజయరమణారావు…..

కాలేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణలో ఆలస్యం, బీజేపీపై విమర్శలు, హరీష్ రావు,కేటీఆర్‌కు బహిరంగ చర్చ సవాల్…

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గురువారం ప్రారంభించారు.

మడిపల్లికాలనీ, పెగడపల్లి, గంగారం, పందిళ్ళ, లక్ష్మీపురం, ఇప్పలపల్లి, అరేపల్లి, తారుపల్లి, మిర్జంపేట తదితర గ్రామాల్లో అధికారులు, స్థానిక నాయకులతో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

లక్ష్మీపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు జరుగుతుందని, గింజ కటింగ్ ఉండదని స్పష్టం చేశారు. రైతులకు అండగా ప్రజాప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు.

కాలేశ్వరం ప్రాజెక్ట్‌పై మాట్లాడుతూ, సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను కాపాడేందుకు ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై హరీష్ రావు, కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నిర్మాణాల్లో లోపాలు వెలుగుచూశాయని, సాగునీటి ప్రయోజనం ఆశించిన స్థాయిలో అందలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మితమైన ఎస్సారెస్పీ, శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు నీరు అందుతోందన్నారు.

రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు వరి పండిస్తున్నారని, కానీ కేంద్రం రా రైస్ కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వడంలేదని కేంద్ర మంత్రులపై విమర్శలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రైతుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, ప్యాక్స్ స్పెషల్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి, సీఈవో కోలేటి శ్రీనివాస్, మార్కెట్ సెక్రటరీ ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top