
మే డే రోజున కాంట్రాక్ట్ కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలి…
–ఎన్టీపీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి పత్రం అందజేసిన జేఏసీ ….
పెద్దపల్లి//ఎన్టీపీసీ జ్యోతినగర్: ఎన్టీపీసీ యాజమాన్యం మే 1 ‘మేడే’ సందర్భంగా కాంట్రాక్టు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు జేఏసీ నాయకులు ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్&టి ) ని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ప్రపంచ కార్మిక వర్గ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన మే డే ప్రతి కార్మికుడికి అత్యంత ప్రాముఖ్యత గల పవిత్ర దినమని పేర్కొన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం ప్రతి ఏటా మే డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు అధికారికంగా సెలవు లేకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంట్రాక్టు కార్మికులు సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి హక్కులు, సంక్షేమం పట్ల తగిన గుర్తింపు లేకపోవడం బాధాకరమన్నారు. కార్మికుల మనోభావాలను గౌరవిస్తూ, వారి కుటుంబాలతో కలిసి మే డేను గౌరవప్రదంగా జరుపుకునే అవకాశం కల్పించేందుకు మే 1వ.తేదీని వేతనంతో కూడిన అధికారిక సెలవుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, భవిష్యత్తులో కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి సంబంధించి మరిన్ని చర్యలు తీసుకోవాలని, కార్మిక హక్కులను పరిరక్షించే విధంగా యాజమాన్యం ముందడుగు వేయాలని కోరారు. ఈ అంశంపై యాజమాన్యం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఏఐటీయూసీ నాంసాని శంకర్, సీఐటీయూ గీట్ల లక్ష్మారెడ్డి, ఐఎన్టీయూసీ బి. చందర్, ఐఎఫ్టీయూ చిలుక శంకర్, టీఎన్టీయూసీ ఎ. శ్రీనివాస్, బీఆర్ఎస్ ఈ భూమయ్య, కేసీఎంఎస్ సిహెచ్ సత్యం, టీయూసీఐ ఈ రాజేశ్వర్, హెచ్ఎంఎస్ డి సత్యం, జీఏఎన్‌సీడబ్ల్యూయూ ఆర్ రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.