
జనగామ డివిజన్‌లో దొంగల దందా….
–తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యం, పోలీసుల తక్షణ చర్యలు కోరిన సిపిఐ నేత……
పెద్దపల్లి//గోదావరిఖని: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆరవ డివిజన్ జనగామలో ఇటీవల దొంగతనాలు పెరుగుతున్నాయని, వీటి నివారణకు పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్ కోరారు.
ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో, జనగామ డివిజన్‌లో గత కొద్ది రోజులుగా తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు.
ముఖ్యంగా ఇత్తడి సామానులు, గ్యాస్ సిలిండర్లు వంటి వస్తువులు దొంగిలిస్తున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు కనీసం నాలుగు ఇళ్లలో చోరీలు జరిగాయని, బాధితులు 8వ కాలనీలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసినప్పటికీ దొంగల ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు.
జనగామ డివిజన్ పోలీస్ స్టేషన్‌కు దూరంగా ఉండటాన్ని దొంగలు తమకు అనుకూలంగా భావించి ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో సమీక్షించాలని, అవసరమైన చోట కొత్త కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అలాగే, డివిజన్‌లో పోలీసు పెట్రోలింగ్‌ను క్రమం తప్పకుండా నిర్వహించి, ప్రజల్లో భద్రతా భావాన్ని కల్పించాలన్నారు. అదేవిధంగా, జనగామ డివిజన్‌ను టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.దొంగతనాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు భరోసా కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.