
గంగమ్మకు కళాకారుల సారె
** వర్షంతో కరుణించిన అమ్మవారు
…తిరుపతి: శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి రాయలసీమ రంగస్థలి కళాకారులు బుధవారం సారె సమర్పించారు.
గంగమ్మ జాతర మంగళవారం రాత్రి చాటింపుతో అంగరంగ వైభవంగా ప్రారభమైంది. కాగా ప్రతి సంవత్సరం గంగమ్మ జాతరకు రాయలసీమ రంగస్థలి కళాకారులు వేషాలు వేసుకొని అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా ఉదయం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీల ఆధ్వర్యంలో కళాకారులు వివిధ వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు ప్రారంభం సందర్భంగా ప్రతాప్ స్వామి, నగర సంకీర్తన మండల సభ్యులు, రాయలసీమ రంగస్థలి కళాకారులు, నేరెళ్లమ్మ గుడి వద్ద నుంచి ప్రదర్శనగా బయలుదేరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న కళాకారులకు గంగమ్మ దేవస్థానం చైర్మన్ మహేష్ యాదవ్, ఈవో జయకుమార్ లు సాదర స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు.
కాగా కళాకారులు ధరించిన వివిధ వేషాలకు ముగ్ధురాలై సాక్షాత్తూ గంగమ్మే తిరుపతిలో భారీ వర్షం కురిపించి, వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ కార్యక్రమంలో పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కళాకారులు భాస్కరాచారి, కేఎన్ రాజా, పొన్నాల జేజిరెడ్డి, మిట్టపల్లి బ్రహ్మానందం, చెంగల్రాయులు, వాసు, వెంకటరత్నం, శ్రీకాంత్, మురళి, ముని కృష్ణారెడ్డి, కోదండపాణి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, గంగాధర్, శాంతిప్రియ, జయమ్మ, విజయ కుమారి, అరుణమ్మ, మోహన్ రామ్ రెడ్డి, పలువురు బాల కళాకారులు పాల్గొన్నారు.