
పెద్దపల్లి మెగా జాబ్ మేళా, యువతకు ఉపాధి దిశగా ఎంపీ వంశీకృష్ణ మార్గదర్శనం…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లిలోని వెంకటపద్మ ఫంక్షన్ హాల్లో తెలంగాణ 99 రోజుల పాలన – ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే వేదికగా నిలిచింది.
ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, విప్ విజయరమణరావు, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, రామగుండం మేయర్ స్వామి, చైర్మన్ మల్లయ్య, జిల్లా కలెక్టర్, ఆర్డీవో తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాభివృద్ధి ఎంతో కీలకమని పేర్కొన్నారు. యువత తమ ప్రతిభను మెరుగుపరుచుకొని ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇటువంటి జాబ్ మేళాలు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కీలకమని అభిప్రాయపడ్డారు.
యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, తాము ఎంచుకున్న రంగంలో కృషి చేస్తే విజయాన్ని సాధించవచ్చని ప్రోత్సహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి, పెద్దపల్లి యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.
ఈ జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు హాజరై వివిధ సంస్థలలో ఉద్యోగ అవకాశాల కోసం నమోదు చేసుకున్నారు. కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు విజయవంతం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో యువతకు అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఎంపీ తెలిపారు. ఏటీసీ, టాస్క్ సెంటర్ల ద్వారా నైపుణ్యాభివృద్ధి పెంపొందించి దేశ, విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలను సాధించే అవకాశాలు విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు.