ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

TEJA NEWS

ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

** మహిళా పోలీస్ డీఎస్పీ శ్రీలత సూచన

తిరుపతి: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేటి పరిస్థితుల్లో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీలత కోరారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు
మహిళా శక్తి టీం ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం భాగ్యనగరం గ్రామంలో శక్తి టీం పోలీసులు గ్రామ సభ నిర్వహించి మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, చిన్నారులపై దాడులు, చిన్నారుల కిడ్నాప్‌లు, చిన్నారుల అదృశ్యం, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు వంటి అంశాలపై వివరించారు.

అదేవిధంగా మొబైల్ గేమ్స్, సెల్ ఫోన్లు, సోషల్ మీడియా దుష్ప్రభావాలు, మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు, కేస్ స్టడీస్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఆన్‌లైన్ మోసాలు, గుర్తు తెలియని లింకులు, వీడియో కాల్స్, డ్రగ్స్, మహిళల అక్రమ రవాణా, సైబర్ క్రైమ్, మహిళలపై జరిగే నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన టోల్ ఫ్రీ నంబర్ల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం వేసాలమ్మ దేవాలయం పరిసర ప్రాంతంలో కూడా శక్తి టీం పోలీసులు ప్రజలకు సాధారణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

You cannot copy content of this page

Scroll to Top