
బీసీల హక్కుల కోసం గళమెత్తిన రాజ్ ఠాకూర్…
కులాల వారీ జనగణనతోనే సామాజిక న్యాయం సాధ్యం….
–ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: హైదరాబాద్దే శవ్యాప్తంగా బీసీలకు తగిన న్యాయం జరగాలంటే కులాల వారీ జనగణన తప్పనిసరి అని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. బీసీల జనాభా ఆధారంగా హక్కులు, అవకాశాలు, రాజకీయ మరియు సామాజిక ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఓబీసీ ఎంపీల ఫోరం మాజీ కన్వీనర్, మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు అంబర్‌పేట్ నివాసంలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలో ఎమ్మెల్యే పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, దేశంలో బీసీల వాస్తవ జనాభా వివరాలు వెలుగులోకి వస్తేనే వారికి తగిన న్యాయం జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. సమాజంలో బీసీలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, జనాభాకు అనుగుణంగా అవకాశాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీల అభ్యున్నతే లక్ష్యంగా వి. హనుమంతరావు దీక్ష చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. బీసీ జనగణన అంశంపై ఇప్పటికే పలుమార్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖలు రాసినా స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు.
బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి ప్రత్యేక విధానాలు అమలు చేయాలంటే ముందుగా వారి వాస్తవ జనాభా గణాంకాలు నమోదు కావాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.