విద్యా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి….

TEJA NEWS

విద్యా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి….

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అమలులో అధికారులు సమన్వయంతో పనిచేయాలి…

–సీఎస్ రామకృష్ణారావు…

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:: : ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహించనున్న విద్యాశాఖ వారోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.

శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ రామకృష్ణారావు 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, జనగణన సెల్ఫ్ ఎన్యుమరేషన్, ఫార్మర్ రిజిస్ట్రీ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, విద్యా వారోత్సవాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సూచించారు. విద్యాసంస్థల్లో అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరాలు, వర్క్‌షాప్‌లు, జయశంకర్ బడిబాట కార్యక్రమం, పోషకుల సమావేశాలు, విద్యా వేడుకలు తదితర కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, జనగణనలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు.

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించేలా ఏర్పాట్లు చేయాలని, గన్ని సంచులు, లారీలు, హమాలీలు తగినంతగా అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, ఇంటర్మీడియట్ అధికారి కల్పన, జీసీడీఓ కవితతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top