సింగరేణి భవిష్యత్తుకు బలమైన బాట

TEJA NEWS

సింగరేణి భవిష్యత్తుకు బలమైన బాట….

9 కొత్త గనుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ ముమ్మర చర్యలు….

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: హైదరాబాద్,
సింగరేణి సంస్థకు ఉజ్వల భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 9 కొత్త గనుల ఏర్పాటుకు ముమ్మర చర్యలు చేపట్టింది. మూతపడుతున్న గనుల ఉత్పత్తిని భర్తీ చేయడంతో పాటు కార్మికులకు ఉపాధి కొనసాగింపు, రాష్ట్ర ఇంధన అవసరాల తీర్చడమే లక్ష్యంగా ఈ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు సింగరేణి సంస్థ వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం 9 కొత్త ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర బొగ్గు, అటవీ, పర్యావరణ శాఖలకు ప్రతిపాదనలు పంపింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రత్యేక చొరవతో అనుమతుల ప్రక్రియ వేగవంతం అవుతోంది.

ఇప్పటికే మూడు గనులకు అనుమతులు లభించగా, ఒడిశాలోని నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. కొత్తగూడెం వీకే కోల్ మైన్ కూడా దాదాపు అన్ని అనుమతులు పూర్తి చేసుకుని ఉత్పత్తికి సిద్ధమైంది.
2027-28 నాటికి సింగరేణిలో నాలుగు గనులు మూతపడనున్న నేపథ్యంలో ఏడాదికి 12.51 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. అయితే కొత్తగా ప్రారంభించనున్న ప్రాజెక్టుల ద్వారా ఈ లోటును భర్తీ చేయడంతో పాటు మరో 20 సంవత్సరాలకు పైగా ఉత్పత్తి కొనసాగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కొత్తగా ప్రతిపాదించిన గనుల్లో జేకే ఓపెన్ కాస్ట్, రామగుండం ఓసీ-1 విస్తరణ, గోలేటి ఓపెన్ కాస్ట్, ఎంవీకే ఓపెన్ కాస్ట్, మణుగూరు ఓపెన్ కాస్ట్ ఎక్స్‌టెన్షన్, ఆర్‌కేపీ ఓసీపీ ఫేజ్-2, పీకే కోల్ మైన్ తదితర ప్రాజెక్టులు ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి ప్రత్యేక సమీక్ష నిర్వహించి, ఈ ఏడాదిలోనే మూడు గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులు వెంటనే పొందాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top