బాణోత్ మదన్ లాల్ మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది
మదన్ లాల్ మృతి పార్టీకి, బడుగు బలహీన వర్గాలకు తీరని లోటు
మదన్ లాల్ భౌతిక కాయానికి నివాళ్లు అర్పించిన మాజీ ఎంపీ నామ, మాజీ ఎమ్మెల్యే సండ్ర
ఖమ్మం,
వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాణోత్ మదన్‌లాల్ మృతి తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని బీఆర్‌ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం నాడు ఖమ్మం నగరం లోని కవిరాజ్ నగర్ నందు ఉన్న మదన్ లాల్ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలసి పూల మాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం మీడియా తో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి ప్రజా సమస్యల పై పోరాటం చేసిన నాయకుడు మదన్ లాల్ అన్నారు. గెలిచిన, ఓడిన ప్రజల పక్షాన నిలబడ్డారని పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆయన పనితీరు అందరికీ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. మదన్‌లాల్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుంచేసుకుంటూ ఆయన నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని, ఆయన మృతి పార్టీకి, బడుగు బలహీన వర్గాలకు తీరని లోటని నామ పేర్కొన్నారు. ఎమ్మెల్యే గా వైరా నియోజకవర్గంలో మదన్‌లాల్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. ఆయన ఎప్పుడు ప్రజల మధ్య ఉండే నాయకుడిగా పేరుగాంచారని, ఎల్లప్పుడూ ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండేవారని తెలిపారు. నియోజకవర్గంలో సామాజిక న్యాయం కోసం ఎంతో పోరాడిన మదన్‌లాల్, గిరిజనుల సమస్యలపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించారని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. చివరి దాకా పార్టీ పట్ల నిబద్ధతతో ఉన్నారని నామ తెలిపారు. మదన్ లాల్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు, అనుచరులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని నామ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నామ వెంట బిఆర్ఎస్ నాయకులు తాళ్లూరి జీవన్ కుమార్, వైరా బిఆర్ఎస్ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, దిశా కమిటీ మాజీ సభ్యులు, మాజీ ఎంపిపి కట్టా కృష్ణార్జునరావు, మాజీ ఎంపీపీ సామినేని హరి ప్రసాద్, వైరా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, మోరంపూడి ప్రసాదరావు, గొడ్డేటి మాధవరావు, బత్తుల శ్రీను, వాకదాని కోటేశ్వరరావు, ఏదునూరి శ్రీను, పాల్వంచ రాజేష్, సరిపూడి గోపి సందేశ్, రేగళ్ల కృష్ణ ప్రసాద్, రాంబాబు, నరేష్ తదితరులు ఉన్నారు.
