55 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
** నలుగురు స్మగ్లర్లు అరెస్టు
తిరుపతి: తిరుపతి ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో 55 ఎర్రచందనం దుంగలతో పాటు, ఒక కారు, మోటారు సైకిల్ ను స్వాధీనం చేసుకుని, నలుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ బాలిరెడ్డి మార్గనిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ఎస్ఐ వినోద్ కుమార్ టీమ్ ఆత్మకూరు పరిధిలోని అనంతసాగరం ఫారెస్ట్ సెక్షన్ లో కూంబింగ్ చేపట్టారు. స్థానిక అటవీ అధికారులు టి. శ్రీనివాసులు, సీహెచ్ శ్రీనివాసుల సహాయంతో లోడింగ్ పాయింట్లను తనిఖీ చేసుకుంటూ వెళ్లగా గుడిగుంట ప్రాంతంలో కొందరు కారులో ఎర్రచందనం దుంగలను నింపుతూ కనిపించారు. వారిని చుట్టుముట్టగా కొందరు పారిపోగా నలుగురు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిని తమిళనాడు చెన్నై పరిసర ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. వారి నుంచి 55ఎర్ర చందనం దుంగలు, కారు, మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఒక టన్ను బరువు కల ఈ దుంగలు, రూ. 60లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. పట్టుబడిన వారితో సహా ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు .
