
అభివృద్ధి, సంక్షేమం తో పాటు ప్రజల భద్రత కూడా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత, అందులో భాగంగానే రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహణ
99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఒక గొప్ప కార్యక్రమం : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి
రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి :
అభివృద్ధి, సంక్షేమం తో పాటు ప్రజల భద్రత కూడా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యతని, అందులో భాగంగానే ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పేర్కొన్నారు.
జిల్లాలోని గోపాల్పేట మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి కార్యక్రమం తో పాటు ‘అరైవ్ అలైవ్ ‘ రోడ్డు భద్రత కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి తో పాటు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అందించిన సందేశాన్ని చదివి గ్రామ ప్రజలకు వినిపించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత రెండున్నర ఏళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చదివి వినిపించారు.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం తో పాటు ప్రజల భద్రత కూడా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యతని, అందులో భాగంగానే ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్ నిర్ణయం మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లో సభలు నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నానన్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను నిలుపుకోవాలని సూచించారు. అదేవిధంగా, అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చి అభివృద్ధి ఫలాలను అందజేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి బాగా ఖర్చు చేస్తుందని, ప్రతి ఒక్కరు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎంత ఎత్తుకు ఎదిగిన సొంత ఊరిపై మమకారం కలిగి ఉండాలని, సొంత ఊరికి సేవ చేయాలని సూచించారు. అదేవిధంగా రైతులందరూ పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని సూచించారు. కృత్రిమ ఎరువుల అత్యధికంగా వాడకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగించి వ్యవసాయం చేయాలని సూచించారు. ప్రస్తుతం పామాయిల్ కు మంచి డిమాండ్ ఉందని రైతులు పంట వేయడానికి ముందుకు రావాలని తెలియజేశారు. పామాయిల్ పంట వేసేవారికి ప్రభుత్వం మంచి ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. అవినీతి అత్యాశకు పోకుండా ఉన్నంతలో ఆనందంగా జీవితాన్ని గడపాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చేయడానికి అందరూ బాధ్యతలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళా శక్తి, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పెన్షన్, ఉచిత చీరల పంపిణీ వంటి కార్యక్రమాలతో ప్రజల మన్ననలను అందుకుంటుందన్నారు. గోపాలపేట్ మండలంలో 3897 మంది రైతులకు గాను మొత్తం రూ. 30.02 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా 12,637 మంది రైతులకు గాను 23,275 ఎకరాలకు రూ.13.96 కోట్లు పెట్టుబడి సాయం కింద రైతు భరోసాను అందించడం జరిగిందన్నారు. మండలంలో మొత్తం 10,534 రేషన్ కార్డులు ఉండగా, వాటిలో కొత్తగా 962 రేషన్ కార్డులను జారీ చేసినట్లు తెలియజేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఈ రెండున్నర ఏళ్లలో ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందించింది, ఏ విధమైన అభివృద్ధి చేసింది అనే విషయాలను ప్రజలకు వివరించడమే కాకుండా, ఇంకా ప్రజలకు కావాల్సిన అవసరాలను తెలుసుకునేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, గృహ జ్యోతి, రేషన్ కార్డులు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులను ప్రజలకు వివరించారు.
గోపాల్ పేట మండలం విషయానికి వస్తే మండలంలో 408 మందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. మొత్తం 5088 మంది రైతుల నుంచి 2025-26 ఖరీఫ్ పంట కొనుగోలు చేసి రూ.51.73 కోట్లు రైతుల ఖాతాలో వేయడం జరిగిందన్నారు. 5139 మంది మహిళలకు ఏకరూప చీరలను పంపిణీ చేయడం జరిగింది అన్నారు. 627 మహిళా స్వయం సహాయక సంఘాలకు 1.63 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు చేయడం జరిగిందన్నారు. పేద ప్రజలు కరెంటు బిల్లు భారాన్ని మోయకుండా ఇబ్బందులను తొలగిస్తూ గృహ జ్యోతి పథకంతో 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించడం జరుగుతుందని తెలియజేశారు. గ్రామంలో 4316 మంది లబ్ధిదారులు గృహజ్యోతి ఫలాలను పొందుతున్నట్లు తెలిపారు.
అరైవ్ అలైవ్ కార్యక్రమం లో భాగంగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని గుర్తు చేశారు. హెల్మెట్ ధరించి బైక్ నడపాలని చెప్పారు. ఈ సంవత్సరం జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా 26 మంది మరణించిన విషయాన్ని తెలుపుతూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని అవాలంభించాలని సూచించారు.
డిఎస్పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలను పాటించాలని సూచించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతను తెలియజేస్తూ కొందరు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేయడం జరుగుతున్నట్లు తెలిపారు.
ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షా శిబిరం
అలైవ్ అరైవ్ కార్యక్రమంలో భాగంగా తహసిల్దార్ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులు సందర్శించి అందరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పలువురు ద్విచక్ర వాహనదారులకు పోలీసు శాఖ, జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం రోడ్డు భద్రత నియమాలను పాటిస్తామని ప్రజలందరితో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా పొలికేపాడు గ్రామంలో బెల్ట్ షాపులను లేకుండా చర్యలు తీసుకుంటున్న సర్పంచ్ బంగారయ్యను ముఖ్య అతిథులు సన్మానించారు . అదేవిధంగా బాల్యవివాహాల నిర్మూలన కోసం ఆర్డీఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో డి ఎస్పీ వెంకటేశ్వర్లు, డిటిఓ మానస, మండల ప్రత్యేక అధికారి, డివైస్ ఓ సుధీర్ రెడ్డి, గోపాల్పేట సర్పంచ్ స్వప్న, నాయకులు యాదయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.