క్రీడాకారుల ప్రయోజనాలకు పెద్దపీట
** క్రీడా అంశాలపై మంత్రి లోకేష్‌కు “శాప్” ఛైర్మన్ వినతి
విజయవాడ: క్రీడాకారులకు ప్రయోజనకరంగా క్రీడాపరంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని “శాప్” ఛైర్మన్ అనిమిని రవినాయుడు విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌ను కోరారు. క్రీడాకారులు, వివిధ అసోసియేషన్ల నుంచి వచ్చిన వినతుల మేరకు మంత్రి లోకేష్‌ను “శాప్” ఛైర్మన్ మచిలీపట్నంలో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ క్రీడల్లో పూర్తిస్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు పాఠశాల, కళాశాలల్లో హాజరు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యాసంవత్సరానికి సంబంధించి కోచింగ్ క్యాంపులకు వెళ్లేలా హాజరు విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరారు. అలాగే స్కూల్ లెవల్ క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు గ్రేస్మార్క్ను అదనంగా జోడించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధిహామీ నిధులను వినియోగించి క్రీడా ప్రాంగణాల్లో వసతులను కల్పించాలని విన్నవించారు. దీనిపై మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
