జూలై 9న దేశావ్యాప్త సార్వత్రిక సమ్మె

TEJA NEWS

జూలై 9న దేశావ్యాప్త సార్వత్రిక సమ్మె

** కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుదాం

తిరుపతి: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా చేపడుతున్న సార్వత్రిక సమ్మె తో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మెడలు వంచి కార్మిక హక్కులను కాపాడుకుందామని ఇందులో అన్ని కార్మిక సంఘాలు భాగస్వాములై కదంతొక్కాలని అఖిలపక్ష సమావేశంలో కార్మిక సంఘాలు, వివిధ పార్టీల నేతలు పిలుపునిచ్చారు.
బుధవారం తిరుపతి నారాయణపురంలోని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి.వెంకటరత్నం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.హరికృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డి, ఏపీ రైతు కూలీ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు ఆర్.వెంకయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షుడు జి.బాలసుబ్రమణ్యం, సిపిఎం నగర కార్యదర్శి వేణు, సిపిఐ జిల్లా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, ఏఐటీయూసీ నగర కార్యదర్శి ఎన్.డి.రవి, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేష్, ఐఎఫ్టియు తిరుపతి జిల్లా అధ్యక్షురాలు జి.భారతి, పిఓడబ్ల్యు తిరుపతి జిల్లా కన్వీనర్ ఎం.అరుణ, ఐఎఫ్టియు తిరుపతి నగర కన్వీనర్ పి.లోకేష్, ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి కుడుం విజయ్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. దేశంలో పేద, బడుగు, బలహీన వర్గాలు, కార్మికులు, రైతుల సంక్షేమాన్ని పక్కనపెట్టి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులు సంఘాలను కూడా పెట్టుకునే అవకాశం లేకుండా చేయడం దుర్మార్గమన్నారు. శ్రమదోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు ప్రశ్నించే హక్కును, సంఘటితమయ్యే హక్కులను కాలరాసేలా వ్యవహరించడం కేంద్రం తీవ్రతరం చేసిందన్నారు.

కేంద్రం తీసుకొచ్చిన శ్రమ దోపిడీ చర్యలకు మద్దతుగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు 8 గంటల పని విధానం రద్దు చేస్తూ 10 గంటల పని విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం కార్మిక వ్యతిరేక చర్యలని మండిపడ్డారు. దేశంలో మహిళలు అధిక శ్రమ దోపిడీకి గురవుతున్నారని దీనిని మరింత తీవ్రతరం చేసేలా దేశంలోనే తొలిసారిగా కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపడాన్ని వ్యతిరేకించాలని వారు పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూరులో వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మె విజయవంతం కోసం ఈ నెల 27వ తేదీన ఏఐటియుసి కార్యాలయంలో మరోసారి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని, ఆ తరువాత సిఐటియు కార్యాలయంలో కార్మిక సంఘాల సదస్సు, జూలై 6న తిరుపతిలో కార్మిక సంఘాల స్కూటర్ ర్యాలీ నిర్వహించాలని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో పిడిఎస్యు నాయకులు లోకేష్, ఐఎఫ్టియు నాయకులు బి కృష్ణమూర్తి, జాకీర్, అంగన్వాడి నాయకురాళ్లు సుజాత, గంగాదేవి, ఆటో యూనియన్ నాయకులు ఎం వెంకటేష్, శివ, సురేష్, నాయకులు రమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top