విజన్ యాక్షన్ ప్లాన్ కమిటీ సమావేశం
తిరుపతి: నియోజకవర్గ విజన్ యాక్షన్ ఫ్లాన్ కమిటీ సమావేశం
ఉదయం కార్పోరేషన్ సమావేశమందిరంలో ఛైర్మన్ హోదాలోని ఎమ్యెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. వికసిత్ భారత్ – 2047 నాటికి నియోజకవర్గం ఏవిధంగా ఏఏ రంగాల్లో అభివృద్ధి జరుగుతుందనే అంచనాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వార్డు కార్యదర్సులు వివరించారు. 2029 నాటికి 10 మార్గదర్శకాల అమలుతో తిరుపతి అభివృద్ధిలో కీలక మైలురాయిని చేరుకోవడం సాధ్యమని కమిటీ వైస్ ఛైర్మన్, కన్వినర్ కమ్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య తెలిపారు. జీరో పావర్టీని సాధించడం కోసం పి-4 విధానాన్ని అమలు చేయడంలో మార్గదర్శకులదే కీలకమని ఆమె చెప్పారు. మార్గదర్శకులకు తోడు బంగారు కుటుంబీకులను సమావేశానికి ఆహ్వానించారు. దీంతో నేరుగా బంగారు కుటుంబ సభ్యుల ఆవేదనను మార్గదర్శకులు విని తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తిరుపతి నియోజకవర్గంలో ఏడువేల మంది బంగారు కుటుంబాలను గుర్తించారు. స్వర్ణాంధ్ర 2047 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు నిర్ణయించి నియోజకవర్గ విజన్ యాక్షన్ ఫ్లాన్ ను తయారు చేశారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. టూరిజం అభివృద్ధితో నియోజకవర్గం అభివృద్ధి ముడిపడి ఉందని ఆయన చెప్పారు.
టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్ గా తిరుపతిని మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం, విజయవాడలకు ధీటుగా తిరుపతిని అభివృద్ధి చేసేందుకు సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లు కట్టుబడి ఉన్నారని ఆయన చెప్పారు. తిరుపతిలో నూతన రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో పాటు త్వరలో ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ నిర్మాణం పనులకు టెండర్స్ ను ప్రభుత్వం పిలవనున్నట్లు ఆయన చెప్పారు. పుణ్యక్షేత్రమే కాకుండా విద్యాకేంద్రంగా బాసిల్లుతున్న తిరుపతిలో ఐటి సెక్టార్ అభివృద్ధితో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనేది తన ఆకాంక్ష అని ఆయన తెలిపారు. రేణిగుంట – చంద్రగిరి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినట్లు కమిషనర్ మౌర్య తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హాసీమ్, డి.ఈ లు, ఏసిపి లు, తదితరులు పాల్గొన్నారు.
