రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినజీవో నెంబర్ 282 రద్దు చేయాలని ప్రతులను దగ్ధం చేసిన ఏఐటియుసి, సిఐటియు
జులై 9 దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు
వనపర్తి : తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 282ను రద్దు చేయాలని సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో జివో ప్రతులను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గంధం మదన్ అధ్యక్షతన ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోషలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబరు 282 ద్వారా కార్మికులు 10 గంటల నుంచి 12 గంటల వరకు పని చేయొచ్చని జీవో విడుదల చేయడం దుర్మార్గం అన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా తెచ్చే విధానానికి వ్యతిరేకంగా గత ఐదు సంవత్సరాలుగా లేబర్ కోడ్స్ అమలు కాకుండా కార్మికులు పోరాడి ఆపారని, కానీ నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం వేగంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తుందని, దానికి మద్దతు ఇస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్282తీసుకురావడం అన్యాయం అన్నారు. లేబర్ కోడ్స్ రద్దు కోసం జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మికుల సిద్ధమవుతున్నప్పుడు పుండు మీద కారం చల్లినట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 282 జీవో విడుదల చేయడం, 10 గంటలు పని చేయాలని నిర్ణయించడం సరైనది కాదన్నారు.
దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తన వర్గ స్వభావాన్ని బయటపెట్టిందని అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం 130 సంవత్సరాలు క్రితం పోరాడి సాధించుకున్న హక్కులన్నింటినీ రద్దు చేసేందుకు సిద్ధమైందని కార్పొరేట్లకు ,శత కోటీశ్వరులకు, కంపెనీ యజమానులకు లాభాలు చేకూర్చే లేబర్ కోడ్స్ ను కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ తెచ్చిందని ఆ లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జులై 9న దేశవ్యాప్త కార్మిక సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 282 ఉపసమరించుకోవాలని కోరారు. లేనిచో బిజెపి, కాంగ్రెస్ విధానం ఒకటే అని ప్రజలు అర్థం చేసుకొని తగిన గుణపాఠం నేర్పుతారని అన్నారు .
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు శ్రీహరి, జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, సిఐటియు జిల్లా నాయకులు డి. కురుమయ్య సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే .సునీత, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం. పరమేశ్వర చారి, సిఐటియు నాయకులు నందిమల్ల రాములు, జి. రాబట్టు, జి. బాలస్వామి, జి. గట్టయ్య, జి. రవి, భాగ్యలక్ష్మి, శ్యామల, మహేశ్వరి, వినీల ,డి. బాలరాజు, సి .పుల్లయ్య, ఏ. రమేష్, బాల పీర్, ఏఐటీయూసీ నాయకులు రమేష్, కురుమయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు
