తిరుమలలో భద్రతను మరింత పెంచాలి

TEJA NEWS

తిరుమలలో భద్రతను మరింత పెంచాలి

** బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి

తిరుపతి: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కారు బాంబు పేలుడు సంఘటనలో అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రవాదుల పిరికి పంద చర్యలను యావత్ భారతావని ముక్తకంఠంతో ఖండిస్తూ “మానవ మృగాలను” కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారని బీజేపీ సీనియర్ నేత పి. నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు.
బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేస్తున్నదనే అక్కసుతో అమాయక ప్రజలను టార్గెట్ చేస్తున్న దుర్మార్గులను బహిరంగంగా శిక్షించాలన్నారు.
భారతదేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ కారు బాంబు బ్లాస్ట్ సంఘటనకు కారకులైన ఉన్మాదులను వదిలే ప్రసక్తే లేదని కఠినంగా శిక్షిస్తామని ఇప్పటికే ప్రకటించారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నదని, తమ మనుగడను కాపాడుకునేందుకు అమాయక ప్రజలను టార్గెట్ చేయడం హేయమైన పిరికిపందల చర్య అని అన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన సంఘటన కారణంగా కేంద్ర ప్రభుత్వం “రెడ్ అలెర్ట్” ప్రకటించినందున తిరుమల తిరుపతి లలో 24/7 నాకాబందీ ఏర్పాటు చేసి తిరుపతికి వచ్చే అన్ని మార్గాలలో “చెక్ పోస్ట్” లు ఏర్పాటు చేసి “పోలీస్ పహారా” నిర్వహించా లన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విమాన, రైలు, రోడ్డు మార్గాలలో వచ్చే అన్ని ప్రాంతాలలో నిరంతరం తనిఖీలు చేయాలని కోరారు. తిరుపతిలోని ప్రైవేట్ వసతి సముదాయాలలో, తిరుమల రెండు ఘాట్ రోడ్లలో, నడక మార్గాలలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో శేషాచలం కొండలను పోలీసు నిఘా నేత్రాలతో “జల్లెడ” పట్టాలన్నారు. ఢిల్లీ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతున్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని నవీన్ కుమార్ పేర్కొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top