రిటర్నింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ లను జాగ్రత్తగా జారీ చేయాలి : జిల్లా కలెక్టర్
సూర్యపేట జిల్లా : జాజిరెడ్డిగూడెం, నాగారం ఎంపిడిఓ కార్యాలయంలలో స్టేజ్ 1,2 రిటర్నింగ్ అధికారులతో గురువారం పంచాయతీ సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. మొదటి విడత ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు,సిబ్బంది కొరకు సంబంధిత ఎంపిడిఓ కార్యాలయంలో డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 9 వరకు ఫెసిలిటీషన్ సెంటర్ ను ఏర్పాటు చేసి అన్ని మౌళిక వసతులు కల్పించాలని,పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి స్టేజి 1 ఆర్ ఓ లు 37 ఏ రిజిస్టర్ లో సర్వీస్ ఓటర్ల వివరాలు నమోదు చేయాలని,స్టేజి 2 ఆర్ ఓ లు 37 సి రిజిస్టర్ లో ఎన్నికలలో విధులు నిర్వహించే వారి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని అన్నారు.
ఫారం -14 తో పాటు సరైన సర్టిపికెట్స్ జతపరిస్తే మార్కుడ్ కాపీ లో మార్క్ చేసి పోస్టల్ బ్యాలెట్ మొదటి నుండి వరస క్రమంలో జారీ చేయాలని సూచించారు. రిటర్నింగ్ అధికారులు సంబంధిత గ్రామ పంచాయతీ లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అన్ని మౌళిక వసతులు ఉన్నాయో లేవో పరిశీలించాలని అలాగే పోలింగ్ తరువాత ఓట్లను కౌంటింగ్ చేయుటకు తగ్గిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాజిరెడ్డి గూడెం మండలంలో 17 గ్రామ పంచాయతీ లకు 64 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారని, 152 వార్డ్ లకు 343 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని అలాగే నాగారం మండలంలో 14 గ్రామ పంచాయతీ లకు 48 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారని, 132 వార్డ్ లలో 4 వార్డ్ లు ఏకగ్రీవం అయ్యాయని 128 వార్డ్ లకు 314 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని కలెక్టర్ కు ఎంపిడిఓ లు వివరించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ లు శ్రీకాంత్, హరి కిషోర్ శర్మ,ఎంపిడిఓ లు ఝాన్సీ, భీమ్ సింగ్, ఎంపిఓ లు గోపి, సుమలత రిటర్నింగ్ అధికారులు, తదితరులు ఉన్నారు.
