రైల్వే డివిజన్ ఇచ్చి ఆదుకోండి సార్…

TEJA NEWS

రైల్వే డివిజన్ ఇచ్చి ఆదుకోండి సార్…

** కేంద్ర రైల్వే మంత్రికి తిరుపతి డివిజన్ సాధన సమితి విన్నపం

** కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కృష్ణదేవరాయలు ప్రత్యేక చొరవ…

న్యూఢిల్లీ / తిరుపతి: ,
తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి, ఆర్ధిక పరంగా మమ్మల్ని ఆదుకోండి సార్… అని రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులు విన్నవించారు. ఈమేరకు “డివిజన్ సాధన సమితి” కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ నేతృత్వంలో సభ్యులు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సమయంలో కేంద్ర పౌర, విమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంట్ టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు కృష్ణదేవ రాయలు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావులు ప్రత్యేక శ్రద్ధ, చొరవ తీసుకుని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులకు అండగా నిలిచారు. పార్లమెంట్ లోని కేంద్ర రైల్వే మంత్రి ఛాంబర్ లో కలిసిన అనంతరం కుప్పాల గిరిధర్ కుమార్ మాట్లాడారు.

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు , ఎంపీ లావు కృష్ణదేవరాయలు బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు ఆవశ్యకతను రైల్వే మంత్రికి వివరించారని తెలిపారు. 30 ఏళ్లుగా నెలకొన్న డిమాండ్ ను పరిష్కరించాలని కోరారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి న్యాయ సముచితంగా అదనపు రైల్వే డివిజన్ ఏర్పాటు ఆవశ్యకం అని కృష్ణదేవరాయలు వివరించారు. ఆర్ధిక పురోగతితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించి దక్షిణ ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు. అంతే కాకుండా యాత్రికుల తాకిడి పెరిగిన దృష్ట్యా తిరుచానూరు, రేణిగుంట, చంద్రగిరి రైల్వే స్టేషన్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు.

శ్రీసిటీ పారిశ్రామిక అభివృద్ధి రీత్యా అంతర్జాతీయ కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. కడప- బెంగుళూరు రైల్వే లైన్ సర్వే పూర్తి కాగా, పనులు వేగవంతం చేయాలన్నారు. నడికుడి- శ్రీకాళహస్తి పనుల్లో వేగం పెంచాలని కోరారు. నాయుడు పేట, గూడూరు, తడ, పుత్తూరు, నగరి, సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్లను కూడా తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. రద్దీ దృష్ట్యా తిరుపతి- గూడూరు మధ్య మూడవ లైన్ ఏర్పాటు చేయాలన్నారు. రేణిగుంట సీఆర్ఎస్ సామర్థ్యాన్ని పెంచి నిధులు మంజూరు చేయాలన్నారు. చిత్తూరులో గూడ్స్ షెడ్ సామర్థ్యం పెంపు, పాకాల రైల్వే స్థల వినియోగంలోకి తెస్తూ.. రైల్వే మెయింటైనెన్స్ వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని, తిరుపతి – కాట్పాడి డబ్లింగ్ పనులు వేగవంతం చేయాలని, హైదరాబాద్ నుంచి గూడూరు వరకు వచ్చే సింహపురి ఎక్స్ ప్రెస్ ను రేణిగుంట వరకు పొడిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులు ఫిల్మ్ సొసైటీ చైర్మన్ ఎమ్.వేణుగోపాల్ రెడ్డి, కస్తూరి బాయ్ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ పీ.సి.రాయల్, ఛాంబర్ అఫ్ కామర్స్ రాష్ట్ర చైర్మన్ కే.వి.చౌదరి, సూరినేని బుజ్జి బాబు నాయుడు, రామచంద్రా రెడ్డి పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top