పార్లమెంటులో ఎంపీ గురుమూర్తి వాయిదా తీర్మానం

TEJA NEWS

పార్లమెంటులో ఎంపీ గురుమూర్తి వాయిదా తీర్మానం

** తిరుపతి సంస్కృత వర్సిటీ ఘటనపై….

తిరుపతి / దిల్లీ: తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్‌, డ్రగ్స్ ఘటనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో అడ్జర్న్‌మెంట్ మోషన్ నోటీసు ఇచ్చారు. బీఈడీ మొదటి సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థినిని అదే వర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధించడం, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరించడం అత్యంత హేయమని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సిన గురువులే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం తిరుపతి ప్రతిష్టకు దెబ్బతీస్తోందని ఎంపీ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, వర్సిటీ హాస్టల్ తనిఖీల్లో 20 గంజాయి ప్యాకెట్లు బయటపడటంతో క్యాంపస్ భద్రతా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఎంపీ గురుమూర్తి అన్నారు. కేంద్ర ప్రభుత్వ యూనివర్శిటీలో విద్యార్థులు మాదక ద్రవ్యాలకు లోనవడం అత్యంత ఆందోళనకరమని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆయన పేర్కొన్నారు. బాలికలు, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు రక్షణ లేకపోవడం అత్యంత బాధాకరమని సూచించారు. ఈ ఘటనలపై వెంటనే ఉన్నత స్థాయి విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని…, క్యాంపస్ భద్రతను బలోపేతం చేసి డ్రగ్-ఫ్రీ వాతావరణాన్ని ఏర్పరచాలని ఎంపీ గురుమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.

You cannot copy content of this page

Scroll to Top