మా ఇంటి ఓటు అమ్మబడదు అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న నిరసన
ఎన్నికల పర్వం నడుస్తున్న వేళ, ఓటు హక్కు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఓటు విలువను, రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ ఆశయాన్ని చాటిచెబుతూ ఇంటి గేటుకే ప్రత్యేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి స్ఫూర్తిగా నిలిచాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామానికి చెందిన గడ్డం పుల్లారావు – లక్ష్మి దంపతుల తనయుడు గడ్డం సతీష్ గౌడ్ ఈ వినూత్న నిరసనను చేపట్టారు. సాధారణంగా ప్రజలు తమ ఇంటి గేట్లపై శుభకార్యాల వివరాలు, దుకాణం బోర్డులు పెట్టడం చూస్తుంటాం. కానీ సతీష్ గౌడ్ ఏకంగా తమ ఇంటి ప్రధాన గేటుకు మా ఇంటి ఓటు అమ్మబడదు అనే సందేశంతో కూడిన ఫ్లెక్సీ బోర్డును ఏర్పాటు చేశారు.
అంబేద్కర్ ఆశయమే లక్ష్యం
ఈ ఫ్లెక్సీలో కేవలం నిరసన సందేశం మాత్రమే కాకుండా, డా.బి.ఆర్. అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబిస్తూ, ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలిపే స్పష్టమైన సందేశాన్ని కూడా ముద్రించారు. ఓటు హక్కు ద్వారానే మనం పాలకులమవుతాము. దానిని తెలివిగా ఉపయోగించాలి. ఓటు అమ్ముకుంటే, మన భవిష్యత్తును మనమే నాశనం చేసుకున్నట్లు అవుతుంది. మంచి నాయకుడిని ఎంచుకోవాల్సిన బాధ్యత మన అందరిది
ప్రజలకు స్పష్టమైన సందేశం
ప్రతి ఓటరు తమ ఓటు హక్కును విలువైనదిగా భావించి, స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని అమ్ముకోవడాన్ని నివారించాలనేదే తన ముఖ్య ఉద్దేశమని సతీష్ గౌడ్ తెలియజేశారు. ఒక్క ఓటు అమ్మకానికి దారితీసినా, అది మొత్తం సమాజ భవిష్యత్తుకు నష్టమని ఆయన ప్రజలకు స్పష్టంగా చెప్పదలచుకున్నారు.తాజాగా ఈ వినూత్న సంఘటన తిరుమలకుంట గ్రామంలోనే కాక, పరిసర ప్రాంతాల్లోనూ మంచి స్పందన తెస్తోంది. సతీష్ గౌడ్ యొక్క ఈ ఆలోచనను పలువురు ప్రశంసిస్తున్నారు.
