మైనారిటీలకు ఉపాధి హామీతో ఉచిత శిక్షణా కోర్సులు
ప్రారంభించిన సికింద్రాబాద్ శాసనసభ్యులు పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ : సీతఫలమండీ లోని సెట్విన్ శిక్షణా కేంద్రంలో ముస్లిం లతో పాటు అందరూ మైనారిటీ లకు వివిధ ఉచిత శిక్షణ కోర్సులను నిర్వహిస్తున్నట్లు సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో ఉచిత శిక్షణకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించి, కోర్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ తో పాటు అన్ని ప్రాంతాలకు చెందిన మైనారిటీలకు ఎమర్జెన్సీ కేర్ అసిస్టెంట్, కస్మేటాలజిస్ట్ , వేర్ హౌస్ సూపర్వైజర్ కోర్సులను ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆరు నెలల పాటు నిర్వహించే ఈ కోర్స్ లలో చేరేవారికి నెలకు రూ.రెండు వేల చొప్పున పారితోషికాన్ని కూడా అందిస్తామని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి వెంటనే ఉద్యోగావకాశాన్ని కల్పించేందుకు కూడా ఏర్పాట్లు జరిపామని తెలిపారు. ఈ సదవకాశాన్ని సికింద్రాబాద్ కు చెందిన మైనారిటీ లు సద్వినియోగం చేసుకోవాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. సెట్విన్ సెంటర్ ఇంచార్జ్ శ్రీమతి అనిత, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
