చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖామంత్రి గడ్డం వివేకానంద
డిసెంబర్ 19
చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖామంత్రి గడ్డం వివేకానంద అన్నారు. శుక్రవారం జిల్లాలోని చెన్నూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కమ్యూనిటీ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులతో కలిసి హాజరై కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా చెన్నూర్ మండల కేంద్రంలో 20 లక్షల రూపాయల డి ఎం ఎఫ్ టి నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, భవనం మరింత విస్తరించేందుకు అదనంగా మరో 20 లక్షల రూపాయలను మంజూరు చేసి అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కమ్యూనిటీ భవనాన్ని దళిత సంఘాలు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, నిర్దేశిత నిబంధనలతో భవన నిర్వహణ కొరకు కమిటీ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇదే తరహాలో భీమారం మండలంలో 25 లక్షల రూపాయలతో నేతకాని భవనం, జైపూర్ మండలంలో 25 లక్షల రూపాయల వ్యయంతో జగ్జీవన్ రామ్ భవనం, చెన్నూర్ మండలంలో 25 లక్షల రూపాయల వ్యయంతో ముదిరాజ్ భవనం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా భవనాలకు బాదనపునిధలు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కమ్యూనిటీ భవన నిర్మాణం కొరకు భూమి కలిగి ఉన్నట్లయితే ప్రభుత్వం తరఫున భవన నిర్మాణానికి చేయూత ఇస్తామని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంలో 15 కోట్ల రూపాయలతో సి. సి. రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, వచ్చే విడతలో 70/80 కోట్ల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు త్రాగునీటి కొరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమృత్ పథకం ద్వారా నీటి ట్యాంకులు, పైప్ లైన్లు ఏర్పాటు చేసి నిరంతరం త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెన్నూరు ప్రాంతంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని, మే నెల వరకు ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు, ఆసుపత్రిలో తగినంత సిబ్బంది నియామకానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అనంతరం 9 కోట్ల 55 లక్షల రూపాయల టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో చేపట్టిన సమీకృత కూరగాయల మార్కెట్ ను ప్రారంభించారు. ప్రజలందరికీ ఒకే చోట కూరగాయలు, మాంసపు ఉత్పత్తులు అందుబాటులో ఉంచేందుకు సమీకృత మార్కెట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, మాంసకు ఉత్పత్తులకు సంబంధించి మార్కెట్లో నెలకొన్న సాంకేతిక సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెన్నూరు మండల కేంద్రంలోని 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మాత శిశు ఆసుపత్రిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి కిడ్నీ బాధితులకు సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. అమృత్ పథకం క్రింద చెన్నూర్ మున్సిపాలిటీలో 30 కోట్ల రూపాయలు, క్యాతనపల్లి మున్సిపాలిటీలో 40 కోట్ల రూపాయలు, మందమర్రి మున్సిపాలిటీలో 30 కోట్ల రూపాయలతో ప్రజలకు త్రాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంబేద్కర్ భవనాన్ని ప్రజలు బహుళ ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చని, ఈ భవనంలో గ్రంథాలయ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమీకృత కూరగాయల మార్కెట్ ఏర్పాటు ద్వారా వీధి వ్యాపారులకు ఒక ఫ్లాట్ ఫాం ఏర్పాటుచేసి ఒకే చోట ప్రజలందరికీ కూరగాయలు, మాంసపు ఉత్పత్తులు అందుబాటులో ఉంచడం జరుగుతుందని, సమీకృత మార్కెట్ లో సామూహిక సౌచాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అమృత్ పథకంలో భాగంగా పైప్ లైన్లు, 3 నీతి ట్యాంకుల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణంలో భాగంగా గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేయడం జరిగిందని, ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రాంతంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధితో పాటు ప్రజల సౌకర్యార్థం అంతర్గత రహదారులు, మురుగు కాలువల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన వైద్యాధికారులు, సిబ్బందిని నియమించి ప్రజలకు వైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతరం చెన్నూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తో సమీక్షించి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జైపూర్ ఎ సి పి వెంకటేశ్వర్లు, చెన్నూర్ తహసిల్దార్ మల్లికార్జున్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు…
