విద్యార్థులు సమరశీల పోరాటాలను ఉదృతం చేయాలి : కాంపాటి పృథ్వీ
సూర్యాపేట జిల్లా ప్రతినిధి: విద్యార్ధులు సమరశీల పోరాటాలను తీవ్రతరం చేయాలని పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కంపాటీ పృథ్వీ పిలుపునిచ్చారు. మంగళవారం పిడిఎస్యు సూర్యాపేట జిల్లా 23వ మహాసభ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ యానాల వీరారెడ్డి నగర్, సాయి గౌతమి కళాశాలలో జిల్లా నాయకులు భీమనపల్లి ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సభలో విద్యార్థి అమరవీరులకు మౌనం పాటించి నివాళులర్పించడం జరిగింది.అనంతరం జరిగిన సభలో పిడిఎస్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్ లు పాల్గొని మాట్లాడుతూ విద్యా ఒక అంగడి సరుకు గా పేద సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి అందని ద్రాక్ష లాగా మారిందని, భారత రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కులో భాగంగా అందరికీ సమాన విద్యా, వైద్య అవకాశాలు నీటిమీద రాతలా మారి 2020 నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ఉన్న కాస్త విద్య అవకాశాలను దూరం చేయటానికి పాలకులు కుట్రలను తీవ్రతరం చేస్తున్నారని అన్నారు.
హేతువాద భావాలను, ప్రజాస్వామిక విలువలను, సామాజిక చైతన్యాన్ని బూతు పదాలుగా చిత్రీకరిస్తున్నారని, కాలం చెల్లిన మనుధర్మాన్ని దానిలో ఉన్న వికృతమైన విలువలను నేడు మనకు ఆదర్శమంటూ బిజెపి- ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాలు విద్యా విధానాన్ని సమూలంగా మార్చి దేశ భవిష్యత్ తరాలకు అత్యంత ప్రమాదకరంగా,తిరోగామి ఆలోచనలకు పునాదిగా మారుతున్న క్రమంలో దీనిపై ఐక్యంగా సమరశీల పోరాటాలను తీవ్రతరం చేయాలని ఆయన అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను అందరికీ అందించే బాధ్యత నుండి తప్పుకున్నాయని, ఫలితంగా ప్రభుత్వ విద్యాసంస్థలలో కనీస మౌలిక వసతులు లేవని బోధన, బోధనేతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని,సైన్స్ పరికరాలు, లైబ్రరీ, ఆట వస్తువులు మానసిక శారీరక ఉత్సాహాన్ని కలిగించే రీతిలో 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటి ప్రభుత్వ విద్యాసంస్థలు లేకపోవడం సిగ్గుచేటు అని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లు, మెస్ చార్జీలపై ఆధారపడి చదువుతున్న 80 శాతం గా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి బడుగు,బలహీన వర్గాల విద్యార్థులకు నేటి పాలకుల విధానాలు పుండు మీద కారం చల్లిన చందంగా ఉన్నాయని ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహించిన ఘన చరిత్ర గలిగిన పి.డి.ఎస్.యు. విద్యార్థులలో సామాజిక స్పృహను పెంచడానికి నిరంతర కృషి చేస్తుందని తెలిపారు.
జార్జి రెడ్డి, జంపాల, శ్రీపాద శ్రీహరి, కోలా శంకర్, దుస్సా చేరాలు, రమణయ్య, వీరారెడ్డి, వరహాలు, చాంద్ పాషా, మధు సుదన్ రాజ్, వీరన్న, స్నేహలత, రంగవల్లి లాంటి ఎందరో తమ అమూల్యమైన ప్రాణాలను విద్యారంగ సమస్యల పరిష్కారంతో పాటు, సమాజ మార్పుకు తృణప్రాయంగా అర్పించారని అన్నారు.అంతటి పోరాట త్యాగాల వారసత్వం కలిగిన పి.డి.ఎస్.యు. ఆ బాధ్యతలో భాగంగా జనవరి 23,24,25 తేదీలలో ఖమ్మం జిల్లా కేంద్రంలో 23వ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తుందని ఈ మహాసభలలో విద్యార్ధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక,సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, టియుసిఐ జిల్లా అధ్యక్షులు గొడ్డలి నర్సయ్య, పిడిఎస్యు జిల్లా నాయకులు మాలోత్ చందర్ రావు, నితిన్,శిరీష, ప్రసాద్, శ్రీనాథ్, దినేష్, కుమార్, రాజు, బాలు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
